కేరళ అసెంబ్లీ ఎన్నికలకు డెమొక్రటిక్ సోషల్ జస్టిస్ పార్టీ(డీఎస్జేపీ) తరఫున నామినేషన్ వేసిన అనన్యకుమారి అలెక్స్ అనే ట్రాన్స్జెండర్.. పోటీ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. తాను ఎన్నికల ప్రచారం చేయటం లేదని తెలిపారు. పార్టీలో తాను లైంగిక వేధింపుల్ని, తీవ్ర వివక్ష ఎదుర్కొంటున్నట్లు ఆరోపించారు. తనను పబ్లిసిటీ కోసమే పార్టీ నేతలు వాడుకుంటున్నారని చెప్పారు.
తనకు ప్రత్యర్థిగా వెంగర నియోజకవర్గం నుంచి ఐయూఎంఎల్నుంచి పోటీ చేసిన పీకే కున్హాలీ కుట్టిపై దుష్ప్రచారం చేయమని పార్టీ సీనియర్లు ఒత్తిడి చేస్తున్నారని అనన్య ఆరోపించారు. వామపక్ష ప్రభుత్వాన్ని కూడా దూషించాలని సూచించారని తెలిపారు. అంతేకాకుండా వాళ్లు తనను బుర్కా వేసుకోమని చెబుతున్నారని పేర్కొన్నారు. అయితే తాను వీటిని తిరస్కరించినట్లు చెప్పారు. దాంతో పార్టీలో కొందరు తనపై కక్షగట్టి అంతం చేయాలని చూస్తున్నారని ఆరోపించారు.