ప్రథమ ప్రధానమంత్రి జవహర్‌లాల్ నెహ్రూ మద్దతు లేకపోయినా డాక్టర్ బాబూ రాజేంద్రప్రసాద్ రాష్ట్రపతి అయ్యారు. 1947 ఆగస్టు 15న దేశానికి స్వాతంత్య్రం వచ్చిన సమయంలో గవర్నర్ జనరల్‌గా లార్డ్ మౌంట్ బాటన్ ఉన్నారు. 1948లో ఆయన ఇంగ్లండ్ వెళ్లిపోవడంతో చక్రవర్తుల రాజగోపాలాచారి (రాజాజీ) ఆ పదవిలో నియమితులయ్యారు. 1950 జనవరి 26 నుంచి అమల్లోకి వచ్చిన భారత రాజ్యాంగం ప్రకారం గవర్నర్ జనరల్ స్థానంలో రాష్ట్రపతి ఉంటారు. అయితే రాష్ట్రపతి ఎన్నిక నిర్వహించేందుకు అప్పటికి ఎంపీలు, ఎమ్మెల్యేలు లేరు. ఫలితంగా రాజ్యాంగ సభ ద్వారానే రాష్ట్రపతిని ఎన్నుకోవాలని నిర్ణయించారు. ఆ సభకు అధ్యక్షునిగా ఉన్న బాబూ రాజేంద్రప్రసాద్‌ను రాష్ట్రపతి పదవికి తొలి ఎంపికగా అంతా భావించారు. నెహ్రూ మాత్రం ప్రథమ రాష్ట్రపతిగా రాజాజీ ఉండాలని అభిలషించారు. రాజేంద్రప్రసాద్ ప్రగాఢమైన మత విశ్వాసాలున్న వ్యక్తి అనీ, రాష్ట్రపతి పదవికి ఆయన సరైన వ్యక్తి కాదని నెహ్రూ భావించారు.
లేఖతో మనస్తాపం
రాజాజీ రాష్ట్రపతి కావాలని తాను ఆశిస్తున్నట్లు, ఈ విషయంలో ఉప ప్రధానమంత్రి వల్లభ్‌భాయ్ పటేల్‌తోనూ చర్చించినట్లు నెహ్రూ తనకు రాసిన లేఖతో రాజేంద్రప్రసాద్ మనస్తాపానికి గురయ్యారు. దానిపై నెహ్రూ, పటేల్‌లకు సుదీర్ఘ లేఖలు రాశారు. గౌరవంగా పక్కకు తప్పుకోవాలనుకుంటున్నట్లు చెప్పారు. తనతో చర్చించకుండానే నెహ్రూ తన పేరును వివాదంలోకి లాగుతున్నారని పటేల్ అసంతృప్తికి గురయ్యారు. కొద్దిరోజుల పాటు ముగ్గురి నేతల మధ్య లేఖలు కొనసాగాయి.