తెలంగాణ

telangana

ETV Bharat / bharat

బాణసంచా నిషేధం అన్ని రాష్ట్రాలకు వర్తిస్తుంది : సుప్రీం కోర్టు - బాణసంచా నిషేధంపై సుప్రీం కోర్టు

Firecrackers Ban Supreme Court : బాణసంచా నిషేధం అన్ని రాష్ట్రాలకు వర్తిస్తుందని సర్వోన్నత న్యాయస్థానం తేల్చి చెప్పింది. ఈ మేరకు అన్ని రాష్ట్రాలు చర్యలు తీసుకోవాల్సిందేనని ఆదేశాలు జారీ చేసింది.

Firecrackers Ban Supreme Court
Firecrackers Ban Supreme Court

By PTI

Published : Nov 7, 2023, 10:22 PM IST

Updated : Nov 7, 2023, 10:35 PM IST

Firecrackers Ban Supreme Court :పండుగల సందర్భంగా ముఖ్యంగా దీపావళి వేళ.. శబ్ధ, వాయు కాలుష్యాన్ని తగ్గించేందుకు బాణసంచాపై విధించిన నిషేధం అన్ని రాష్ట్రాలకు వర్తిస్తుందని సుప్రీంకోర్టు తేల్చిచెప్పింది. ఈ మేరకు అన్ని రాష్ట్రాలు చర్యలు తీసుకోవాల్సిందేనని ఆదేశాలు జారీ చేసింది. 2018, 2021లో సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలు అమలు చేసేలా రాజస్థాన్‌కు ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌పై విచారణ జరిపిన సుప్రీంకోర్టు.. ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది.

బాణసంచాలో బేరియం సహా నిషేధిత రసాయనాల వాడకానికి వ్యతిరేకంగా గతంలో ఇచ్చిన ఆదేశాలు దిల్లీ సహా దేశమంతటికి వర్తిస్తాయని ధర్మాసనం తేల్చిచెప్పింది. కొత్తగా మళ్లీ ఉత్తర్వులు అవసరం లేదని సుప్రీం కోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఏఎస్ బోపన్న, జస్టిస్ ఎంఎం సుందరేశ్‌తో కూడిన ధర్మాసనం తెలిపింది. రాజస్థాన్‌ సహా అన్ని రాష్ట్రాలు పండుగల వేళ.. వాయు, శబ్ద కాలుష్యాన్ని తగ్గించడానికి చర్యలు తీసుకుంటాయని భావిస్తున్నట్లు సుప్రీం కోర్టు పేర్కొంది. అతి తక్కువ కాలుష్య ఉద్గారాలు, శబ్ధ, వాయు కాలుష్యం విడుదల చేసే పర్యావరణహిత బాణసంచాను మాత్రమే అనుమతిస్తూ గతంలో ఇచ్చిన ఆదేశాలు అన్ని రాష్ట్రాలకు వర్తిస్తాయని పేర్కొంది. పర్యావరణాన్ని కాపాడటం ప్రతి ఒక్కరి బాధ్యత అని ఈ సందర్భంగా సుప్రీం కోర్టు వ్యాఖ్యానించింది.

బాణసంచా తయారీలో నిషేధిత రసాయనాలను ఉపయోగించరాదని 2021లో సుప్రీంకోర్టు ఆదేశించింది. 2018లో సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను అనుసరించి గ్రీన్ క్రాకర్స్‌కు అనుమతి ఉందని స్పష్టం చేసింది. వాటిని కూడా దీపావళి వంటి పర్వదినాల్లో రాత్రి 8 గంటల నుంచి రాత్రి 10గంటల వరకు మాత్రమే కాల్చుకోవచ్చని చెప్పింది. ఏదైనా నిషేధిత రసాయనాలతో నిర్దిష్ట ప్రాంతంలో తయారు చేయడం, విక్రయించినట్లు తేలితే సంబంధిత రాష్ట్రాలే బాధ్యులని స్పష్టం చేసింది.

దిల్లీ కాలుష్యంపైనా హితవు
దిల్లీలో పెరుగుతున్న వాయు కాలుష్యం రాజకీయ యుద్ధంగా మారవద్దని సుప్రీం కోర్టు హితవు పలికింది. క్షీణించిపోతున్న వాయునాణ్యత.. ప్రజల ఆరోగ్యాన్ని హత్య చేస్తోందని పేర్కొంది. దేశ రాజధాని చుట్టు పక్కల రాష్ట్రాలైన పంజాబ్‌, హరియాణా, యూపీ, రాజస్థాన్‌లో పంట వ్యర్థాల దహనాన్ని వెంటనే నిలిపివేసేలా చర్యలు చేపట్టాలని ఆదేశించింది. ఈ రోజు నుంచే పంట వ్యర్ధాల దహనాన్ని ఆపే పనిని ప్రారంభించాలని స్పష్టం చేసింది. బలవంతపు చర్యలు, ప్రోత్సాహకాల ద్వారా ఈ చర్యలకు అడ్డుకట్ట వేయాలని సూచించింది. ఏం చేస్తారో ఎలా చేస్తారో తమకు తెలీదన్న సుప్రీం.. ఎలా అయినా ఈ ప్రమాదాన్ని నివారించాలని నిర్దేశించింది. ఈ విషయమై పంజాబ్, హరియాణా, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్‌ ప్రధాన కార్యదర్శులు బుధవారం సమావేశం నిర్వహించాలని సుప్రీం ఆదేశించింది. సుప్రీం మార్గదర్శకాల ప్రకారం రాష్ట్రాల ప్రభుత్వాలు.. పంటవ్యర్థాల దహనంపై చర్యలు తీసుకోవట్లేదని ఓ న్యాయవాది ఈ పిటిషన్‌ను దాఖలు చేశారు. దానిని విచారించిన సుప్రీం.. తదుపరి విచారణను శుక్రవారానికి వాయిదా వేసింది. అప్పుడు వాహనాలు, ఇతర కాలుష్య ఉత్పాదిత కారకాల గురించి కూడా తెలుసుకుంటామని తెలిపింది

Last Updated : Nov 7, 2023, 10:35 PM IST

ABOUT THE AUTHOR

...view details