Firecracker Accident : సెలవుల్లో పని చేసుకుని డబ్బు సంపాదించేందుకు వచ్చిన 8 మంది విద్యార్థులు సజీవ దహనమయ్యారు. కర్ణాటక-తమిళనాడు సరిహద్దులోని అత్తిబెలెలో జరిగిన బాణసంచా దుకాణ ప్రమాదంలో తమిళనాడులోని ఒకే గ్రామానికి చెందిన 8 మంది విద్యార్థులు మరణించారు.
ధర్మపురి జిల్లాలోని అమ్మపత్తి గ్రామానికి చెందిన 10 మంది అత్తిబెలెలోని ఓ బాణసంచా దుకాణానికి పనికోసం వచ్చారు. శనివారం అగ్నిప్రమాదం జరగగా.. వీరిలో 8 మంది మరణించారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. మృతులను ప్రకాశ్, వేటప్పన్, ఆదికేశవన్, విజయరాఘవన్, ఇలంబర్తి, ఆకాశ్, గిరి, సచిన్‌గా గుర్తించారు పోలీసులు.
ఈ ప్రమాదంలో ఇప్పటివరకు మొత్తం 14 మంది మరణించారు. దుకాణంలోనే 12 మంది సజీవ దహనం కాగా.. మరో ఇద్దరు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయారు.
ఈ కేసు దర్యాప్తు సీఐడీకి అప్పగిస్తాం : సీఎం
Bengaluru Cracker Shop Fire :ఈ ప్రమాదంపై స్పందించిన కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య.. ఈ కేసును సీఐడీకి అప్పగించి దర్యాప్తు చేయిస్తామని వెల్లడించారు. నిబంధనలు అతిక్రమించిన దుకాణ యజమానిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించినట్లు చెప్పారు. మైసూరులోని తన నివాసంలో జనతా దర్శన్ కార్యక్రమం అనంతరం మీడియాతో మాట్లాడారు.
ఐదుగురిపై కేసు నమోదు.. యజమాని, అతడి కొడుకు అరెస్ట్
నిబంధనలను అతిక్రమించిన దుకాణ యజమాని, అతడి కొడుకును అరెస్ట్ చేసినట్లు డీజీపీ అలోక్ మోహన్ వెల్లడించారు. మరో ముగ్గురిపై కూడా వివిధ సెక్షన్ల కింద కేసు నమోదైందని.. వీరిని త్వరలోనే పట్టుకుంటామని చెప్పారు. ఆదివారం ప్రమాద స్థలాన్ని పరిశీలించిన డీజీపీ.. మీడియాతో మాట్లాడారు.