అరేబీయా సముద్ర తీరంలో భారత మత్సకారులను అపహరించేందుకు యత్నించిన ఘటనలో పాక్ నేవీ అధికారులపై గుజరాత్ పోలీసులు కేసు నమోదు చేశారు. అక్టోబర్ 6న ఏడుగురు మత్స్యకారులు జఖౌ సముద్ర తీరంలోని భారత జలాల్లో చేపలు పట్టేందుకు వెళ్లారు. ఈ క్రమంలో పాకిస్థాన్ మెరైన్ సెక్యూరిటీ ఏజెన్సీకి (పీఎంఎస్ఏ) చెందిన బోటులో 20 నుంచి 25 మంది పాక్ జవాన్లు.. భారత పడవపై కాల్పులు జరిపారు. ఈ ఘటనలో పడవ ధ్వంసమై మునిగిపోయింది. అనంతరం మత్య్సకారులను కిడ్నాప్ చేసి తీసుకెళ్లారు.
ఈ సమాచారం అందుకున్న భారత నేవీ అధికారులు హుటాహుటిన అక్కడకు చేరుకున్నారు. భారత సిబ్బందిని చూసిన పాక్ నేవీ బృందం అప్పటికప్పుడు ఓ కట్టుకథ అల్లింది. మునిగిపోతున్న భారత పడవను కాపాడి మత్య్సకారులకు సపర్యలు చేసినట్లు ఓ వీడియో చేయించింది. అది భారత నేవీ బృందానికి చూపింది. అయితే ఘటన తరువాత ఇళ్లకు చేరుకున్న మత్య్సకారులు అసలు విషయాన్నిబయటపెట్టారు. పాక్ నేవీ బృందం.. తమను భయాందోళనకు గురి చేసిందని అన్నారు. అంతేకాకుండా తమను బెదిరించి అబద్ధం చెప్పించిందని తెలిపారు. ఈ వివరాల ఆధారంగా పాక్ నేవీ అధికారులపై చర్యలు తీసుకునేందుకు భారత్ సిద్ధమైంది.