గత అనుభవాలను ఎవరూ మర్చిపోలేదు. చంటి పిల్లలను చంకనేసుకొని వందల కిలోమీటర్లు నడిచిన ఆ చేదు జ్ఞాపకాలు ఇంకా గుర్తున్నాయి. మరోసారి అదే తరహా ప్రమాదఘంటికలు మోగుతున్నాయి. రోజు రోజుకూ కరోనా కేసులు పెరిగిపోతూనే ఉన్నాయి. ఒక్కో రాష్ట్రం రాత్రి కర్ఫ్యూలు, లాక్‌డౌన్లు అంటూ ఆంక్షలు విధించడం మొదలెడుతోంది. దీంతో మరోసారి వలసకార్మికుల నెత్తిన పిడుగుపడినట్లయింది. గతంలో పడిన కష్టాలు మళ్లీ ఎదురవ్వకూడదనే ఉద్దేశంతో పొట్టకూటి కోసం పల్లెటూరిని విడిచి వచ్చిన వలసకార్మికులు మూటాముళ్లూ సర్దుకొని సొంత ఊళ్లకు బయలు దేరుతున్నారు.
వెలవెలబోతున్న దిల్లీ, ముంబయి
సరిగ్గా ఏడాది కిత్రం ఎదురైన చేదు అనుభవం నుంచి కోలుకోకముందే.. కొవిడ్ రెండో దశ వ్యాప్తి ప్రకంపనలు సృష్టిస్తోంది. దేశ రాజధాని దిల్లీతోపాటు, వాణిజ్య రాజధాని కొలువైన మహారాష్ట్ర గజగజ వణికిపోతోంది. మరోవైపు దిల్లీ సర్కారు 6 రోజుల లాక్‌డౌన్ విధించింది. ఆ వార్త వినగానే బస్ టెర్మినల్స్, రైల్వేస్టేషన్లు వలసకార్మికులతో కిటకిటలాడిపోయాయి. ఇది స్వల్ప లాక్‌డౌన్ మాత్రమేనని కార్మికులు దిల్లీని వదలి వెళ్లొద్దని సాక్షాత్తు ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ చెప్పినా.. కార్మికులు వినిపించుకునే పరిస్థితిలో లేరు. మరోవైపు మహారాష్ట్ర కూడా లాక్‌డౌన్ దిశగా అడుగులు వేస్తోంది. ప్రధాని నరేంద్ర మోదీ లాక్‌డౌన్‌ను చివరి అస్త్రంగా మాత్రమే ఉపయోగించాలని చెప్పినప్పటికీ రాష్ట్రాలు తమ జాగ్రత్తల్లో తాము ఉంటున్నాయి. దీంతో వలసకార్మికుల జీవితాలు అగమ్యగోచరంగా తయారయ్యాయి. దీంతో బతికుంటే బలుసాకు తిని బతకొచ్చనే ఉద్దేశంతో స్వస్థలాలకు పయనమవుతున్నారు.
గుజరాత్‌లోనూ...