నూతన సాగు చట్టాలపై సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన కమిటీ సభ్యులు ఈనెల 19న తొలిసారి భౌతికంగా భేటీ కానున్నారు. దిల్లీలోని భారత వ్యవసాయ పరిశోధన సంస్థ ప్రాంగణంలో ఈ సమావేశం నిర్వహించనున్నారు. ఈ విషయాన్ని కమిటీ సభ్యుడు అనిల్ ఘన్వాత్ గురువారం వెల్లడించారు.
గురువారం ఉదయం వర్చువల్ సమావేశం జరగాల్సి ఉండగా కమిటీ సభ్యుడిగా ఉన్న భూపేందర్ సింగ్ మన్ తప్పుకోవడం వల్ల వాయిదా పడింది. శుక్రవారం మరోసారి వర్చువల్ సమావేశం నిర్వహించే అవకాశం ఉందని ఘన్వాత్ అన్నారు.
రైతుల వద్ద వెళ్లేందుకు సిద్ధం..
సుప్రీంకోర్టు మార్పులు చేసేంతవరకు ప్రస్తుతం ఉన్న త్రిసభ్య కమిటీ కొనసాగుతుందన్నారు.
"నన్ను సుప్రీంకోర్టు నియమించింది. కోర్టు నన్ను తొలగించేవరకు నేను కమిటీలో కొనసాగుతాను. మిగతా సభ్యులు కూడా తప్పుకోరనే భావిస్తున్నాను. కానీ ఎవరి అభిప్రాయాలు వారికి ఉంటాయి. ఏ ప్రామాణికాల ఆధారంగా మమల్ని నియమించారో తెలియదు. కానీ వారి నిర్ణయాన్ని గౌరవిస్తాను."