తెలంగాణ

telangana

ETV Bharat / bharat

సింఘు సరిహద్దులో నిరాహార దీక్షకు రైతు సంఘాల పిలుపు - కొత్త సాగు చట్టాలు

farmers-protests
రైతులు ఆందోళనలు

By

Published : Dec 12, 2020, 8:10 AM IST

Updated : Dec 12, 2020, 5:45 PM IST

17:33 December 12

డిసెంబర్ 14న రైతు సంఘాల నాయకులు సింఘు సరిహద్దులో నిరాహార దీక్షకు కూర్చుంటారని 'సంయుక్త కిసాన్​ ఆందోళన్'​ నాయకుడు కమల్​ ప్రీత్​ సింగ్​ పన్ను తెలిపారు. నూతన వ్యవసాయ చట్టాలను కేంద్రం రద్దు చేయాలని, సవరణలకు తాము అంగీకరించే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. తమ ఉద్యమాన్ని నీరుగార్చాలని ప్రభుత్వం చూస్తోందని, కానీ ఆందోళనలను శాంతియుతంగా కొనసాగిస్తూనే ఉంటామని ఆయన స్పష్టం చేశారు.

కేంద్రం చర్చలకు ఆహ్వానిస్తే వెళ్లడానికి తాము సిద్దమేనని రైతు సంఘాల నాయకులు చెప్పారు. కానీ, మొదట చర్చించే అంశం సాగు చట్టాల రద్దు గురించే అయి ఉండాలని తెలిపారు.

15:27 December 12

కనీస మద్దతు ధరపై కేంద్రం నుంచి హామీ కావాలని రైతు సంఘాల నాయకులు డిమాండ్ చేస్తున్నారు. తాము పండించే పంటలన్నింటికీ కనీస మద్ధతు ధర చెల్లించి కొనుగోలు చేయాలన్నారు. దీనికోసం ప్రత్యేక బిల్లును రూపొందించాలని ఆలిండియా కిసాన్ సంఘర్ష్ కోఆర్డినేషన్ కమిటీ నాయకులు సర్దార్ వీఎం సింగ్ డిమాండ్​ చేశారు.

బంగాళదుంప, చెరకు, కూరగాయలు, తృణధాన్యాలు, పాలు వంటి ఉత్పత్తులకు కేంద్రం మద్దతు ధర ప్రకటించాలన్నారు ఉత్తర్​ప్రదేశ్​కు చెందిన రైతు నాయకుడు డంగర్​ సింగ్​. దీనిపై రాతపూర్వక హామీ కాకుండా, చట్టాన్ని రూపొందించాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు.

13:08 December 12

రైతులే వద్దంటున్నా..

రైతు ఆందోళనలపై కేంద్ర వైఖరి పట్ల కీలక వ్యాఖ్యలు చేశారు శిరోమణి అకాలీదళ్​ చీఫ్​ ఎస్​ఎస్​ బాదల్​. అన్నదాతల మాటలు వినాల్సింది పోయి.. వారి గొంతును కేంద్రం అణచివేస్తోందని ఆరోపించారు. ఎవరికోసమైతే చట్టాలు తెచ్చారో.. ఇప్పుడు వారే వద్దంటున్నా.. కేంద్రం తన నిర్ణయాన్ని ఎందుకు రుద్దుతోందని ప్రశ్నించారు.

12:05 December 12

దిల్లీకి మార్చ్​...

దిల్లీ- ఘజియాబాద్​ సరిహద్దులో ఆందోళనలు చేస్తున్న రైతులు... దేశ రాజధాని వైపు మార్చ్​ చేపట్టారు. కేంద్ర ప్రభుత్వం తమ సమస్యలను పరిష్కరించాలని ఈ మార్చ్​ ద్వారా సందేశం పంపుతున్నట్టు పేర్కొన్నారు.

11:39 December 12

రైతు దీక్ష: దిల్లీ సరిహద్దుల్లోని టోల్​ ప్లాజాల మూసివేత

కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త సాగు చట్టాలను నిరసిస్తూ చేపట్టిన ఆందోళనలను ఉద్ధృతం చేశారు రైతులు. ఈ క్రమంలో దేశ రాజధాని దిల్లీ సమీప సరిహద్దుల్లోని టోల్​ ప్లాజాలను మూసివేశారు. ఎలాంటి రుసుములు వసూలు చేయకుండా వాహనాలను పంపిస్తూ.. నిరసన తెలుపుతున్నారు.  

శుక్రవారం అర్ధరాత్రి నుంచే దిల్లీ-హరియాణా సరిహద్దు కర్నాల్​లోని బస్తారా టోల్​ ప్లాజాను మూసివేసి వాహనాలను అనుమతిస్తున్నారు. కేంద్రానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నిరసనలు తెలిపారు రైతులు. అలాగే..  అంబాలలోని శంభు టోల్​ప్లాజానూ మూసివేశారు.  

"గత అర్ధరాత్రి 12 గంటల నుంచి ఈ టోల్​ప్లాజా మూసివేసి వాహనాలకు అనుమతించాం. కొందరు రైతులు వచ్చి మూసివేయాలని కోరారు. మాకు ఎలాంటి అధికారిక ఆదేశాలు అందలేదు. కానీ , ఈ నిరసన శనివారం అర్ధరాత్రి 12 గంటల వరకు కొనసాగుతుందని తెలిపారు. "  

          - రవి తివారీ, శంభు టోల్​ప్లాజా ఇంజార్జి

శనివారం ఉదయం హిసార్​-దిల్లీ ఎన్​హెచ్​-9 రహదారిపై ఉన్న మయ్యడ్​ టోల్​ప్లాజాను మూసివేశారు రైతులు. వాహనాలను ఎలాంటి ఫీజు చెల్లించకుండానే అనుమతిస్తున్నారు. ఈ టోల్​ప్లాజా పంజాబ్​, రాజస్థాన్​లను దిల్లీతో అనుసంధానిస్తుంది. ప్రస్తుతం అక్కడ భారీగా పోలీసులను మోహరించారు.  

ఆగ్రాలో సాధారణంగానే..

ఆగ్రా జిల్లాలోని 5 టోల్​ప్లాజాల్లో సాధారణంగానే రుసుముల వసూలు కొనసాగుతోంది. టోల్​ప్లాజాలను రైతులు మూసివేసినట్లు తమ దృష్టికి రాలేదని ఆగ్ర జిల్లా ఏఎస్పీ తెలిపారు. అన్నింటిపై నిఘా పెట్టామన్నారు. ఈ క్రమంలో ఖందోలి టోల్​ ప్లాజా వద్ద సాధారణ పరిస్థితులు కనిపిస్తున్నాయి.  

దిల్లీ సరిహద్దులకు బయలుదేరిన రైతులు..

వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా చేపట్టిన ఆందోళనలకు మరింత బలం చేకూరుతోంది. నిరసనల్లో పాల్గొనేందుకు కురుక్షేత్ర నుంచి ట్రాక్టర్లతో దిల్లీకి బయలుదేరారు అన్నదాతలు.  

డిసెంబర్​ 14న దేశవ్యాప్త ఆందోళనలు

కేంద్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ డిసెంబర్​ 14న దేశవ్యాప్తంగా ఆందోళనలు చేపడుతున్నట్లు వెల్లడించాయి రైతు సంఘాలు. దిల్లీ, హరియాణా, పంజాబ్​, మధ్యప్రదేశ్​, ఉత్తర్​ప్రదేశ్​, రాజస్థాన్​, ఉత్తరాఖండ్​ రాష్ట్రాల్లో జిల్లా ప్రధాన కార్యాలయాల ముందు ఒకరోజంతా నిరసనలు చేపట్టనున్నట్లు చెప్పాయి. అలాగే ఇతర రాష్ట్రాల్లోనూ అదే రోజు నుంచి నిరవధిక నిరసనలు చేస్తున్నట్లు వెల్లడించాయి.

10:01 December 12

ట్రాక్టర్లలో..

దేశ రాజధానికి దేశం నలుమూల నుంచి రైతులు చేరుతున్నారు. ముఖ్యంగా ఉత్తర భారతంలోని అన్నదాతలు.. సాగు చట్టలకు వ్యతిరేకంగా తలపెట్టిన నిరసనలకు భారీ సంఖ్యల్లో తరలివెళుతున్నారు. తాజాగా.. కురుక్షేత్రం నుంచి ట్రాక్టర్లలలో బయలదేరారు.

09:53 December 12

టోల్​ ప్లాజా మూసివేత..

సాగు చట్టాలకు వ్యతిరేకంగా రైతన్నలు తమ ఆందోళనలు ఉద్ధృతం చేశాయి. టోల్​ గేట్ల వద్ద రుసులు కట్టకుండా నిరసన తెలిపేందుకు నిర్ణయించాయి. ఈ క్రమంలో హరియాణలోని బస్తార టోల్​ ప్లాజను రైతులు పూర్తిగా మూసివేశారు. 

09:07 December 12

3,500 బలగాల మోహరింపు..

సాగు చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళనలు ఉద్ధృతం చేస్తూ.. దిల్లీ రహదారులను దిగ్బంధిస్తామని రైతులు హెచ్చరించిన క్రమంలో భారీగా బలగాలను మోహరించారు పోలీసులు. దిల్లీకి చేరుకునే రహదారుల్లోని 5 టోల్​ప్లాజాల వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా, సురక్షిత ప్రయాణాల కోసం 3,500 సిబ్బందిని ఆయా ప్రాంతాలకు తరలించినట్లు ఫరిదాబాద్​ పోలీసులు తెలిపారు. బదర్​పుర్​ సరిహద్దు, గురుగ్రామ్​ ఫరిదాబాద్​, కుండ్లీ-ఘజియాబాద్​-పల్వాల్​, పాలి క్రుషెర్​ జోన్​, దౌజ్​ టోల్​ ప్లాజాల వద్ద పోలీసులను మోహరించినట్లు తెలిపారు. ఆందోళనలు పర్యవేక్షించేందుకు డ్రోన్లను సైతం రంగంలోకి దింపుతున్నట్లు చెప్పారు.  

07:46 December 12

17వ రోజుకు ఆందోళనలు

కేంద్ర ప్రభుత్వం ఇటీవల తీసుకొచ్చిన మూడు వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ చేపట్టిన ఆందోళనలు 17వ రోజుకు చేరుకున్నాయి. చట్టాల్లో సవరణలు చేస్తామని కేంద్రం చేసిన ప్రతిపాదనలను తిరస్కరిస్తూ నిరసనలు కొనసాగిస్తున్నారు కర్షకులు.  

ఈ క్రమంలో వారికి మరింత మద్దతు పెరుగుతోంది. అమృత్​సర్​లోని కిసాన్​ మజ్దూర్​ సంఘర్ష్​ కమిటీ సభ్యులు 700 ట్రాక్టర్లతో దిల్లీకి బయల్దేరారు. కుండ్లి సరిహద్దులో ఆందోళనలు చేపట్టనున్నారు. దిల్లీ-జైపుర్​, దిల్లీ-ఆగ్రా రహదారులను దిగ్బంధిస్తామని హెచ్చరించారు. టోల్​గేట్ల వద్ద రుసుం కట్టకుండా నిరసన తెలపాలని పిలుపునిచ్చారు.  

ఆందోళనలు విరమించి చర్చలకు రావాలని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్​ తోమర్​ కోరగా.. స్పందించిన రైతు సంఘాలు చర్చలపై ప్రభుత్వానికి ఆసక్తి ఉంటే గతంలో మాదిరిగానే ఆహ్వానిస్తూ లేఖ పంపించాలని స్పష్టం చేశాయి. 

Last Updated : Dec 12, 2020, 5:45 PM IST

ABOUT THE AUTHOR

...view details