MVV Satyanarayana Family Members Kidnapped: వైసీపీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ కుటుంబ సభ్యులను రెండు రోజుల పాటు కిడ్నాపర్లు బంధించడం.. విశాఖలో తీవ్ర కలకలం రేపింది. ఎంపీ కుమారుడు, ఆడిటర్‌ను హింసించిన దుండగులు.. వారి నుంచి కోటి 75 లక్షల రూపాయలు దండుకున్నట్లు పోలీస్ కమిషనర్ వెల్లడించారు. పోలీసులు రంగంలోకి దిగడంతో బందీలను వదిలేసి పారిపోయారని.. చాకచక్యంగా వారిని పట్టుకున్నామని వివరించారు.
CP on MP MVV Family Members Kidnap: డబ్బు కోసమే.. ఎంపీ ఎంవీవీ కుటుంబ సభ్యుల కిడ్నాప్: విశాఖ సీపీ త్రివిక్రమ వర్మ
12:29 June 15
కిడ్నాపర్లను అదుపులోకి తీసుకున్నాం: పోలీసులు
విశాఖపట్నంలో అధికార పార్టీ ఎంపీ M.V.V.సత్యనారాయణ భార్య, కుమారుడితోపాటు ఆడిటర్‌ను కిడ్నాపర్లు బంధించినట్లు.. పోలీస్ కమిషనర్ త్రివిక్రమ వర్మ వెల్లడించారు. ఈ నెల13న ఎంపీకి చెందిన కొత్త ఇంట్లో ఆయన కుమారుడు శరత్‌చంద్రను బంధించి హింసించినట్లు తెలిపారు ఒకరోజు తర్వాత శరత్ చంద్రతో ఫోన్ చేయించిన ఎంపీ భార్యను రప్పించి నగలు లాక్కున్నారని, ఆ తర్వాత ఆడిటర్ గన్నమనేని వెంకటేశ్వరరావును పిలిపించారని చెప్పారు.
ఎంపీ ఇంటికి వచ్చిన ఆడిటర్‌ను కూడా దుండగులు హింసించినట్లు వివరించారు. ఆ తర్వాత ఆడిటర్‌తోనే ఆయన మనుషులకు ఫోన్ చేయించి... కోటి 75 లక్షల రూపాయలు డబ్బులు తెప్పించుకున్నారని సీపీ పేర్కొన్నారు. బుధవారం మొదలైన ఈ బందీ కథ.. ఇవాళ ఉదయం వరకు సాగినట్లు చెప్పారు.
ఎంపీ M.V.V.సత్యనారాయణ ఫోన్ చేసి ఆడిటర్ వెంకటేశ్వరరావు కిడ్నాప్ అయినట్లు అనుమానం ఉందని చెప్పడంతో తాము రంగంలోకి దిగామని సీపీ చెప్పారు. టెక్నాలజీ సాయంతో ట్రాక్ చేస్తూ ముందుకు సాగడంతో బందీలతో సహా ఎంపీకి చెందిన ఆడీ కారులో కిడ్నాపర్లు ఇంటి నుంచి బయటికొచ్చారని అన్నారు. కొంతదూరం వెళ్లాక బందీలను వదిలేసి పారిపోతుండగా పోలీసులు వెంటాడి నిందితులను పట్టుకున్నామని చెప్పారు. ఎంపీ కుటుంబాన్ని బంధించిన నిందితులను ఆనందపురం పోలీస్ స్టేషన్లో పోలీసులు విచారణ చేస్తున్నారు. ఆనందపురం పోలీస్ స్టేషన్‌కు వైపు ఎవరినీ రానివ్వకుండా ముగ్గురు డీసీపీల ఆధ్వర్యంలో ఇంటరాగేషన్ కొనసాగుతోంది.