Facing Poverty Mother Sells Newborn: పేదరికం తెచ్చిన కష్టాలను తట్టుకోలేని ఓ తల్లి.. పసిబిడ్డను రూ.5వేలకు అమ్ముకుంది. ఝార్ఖండ్ గుమ్లా జిల్లా అంబేడ్కర్ నగర్లో జరిగిందీ ఘటన.
ఆకలి.. అనారోగ్యం..
గుడియా దేవి- భజరంగ్ నాయక్ దంపతులకు నలుగురు పిల్లలు. పెద్దమ్మాయి ఖుషీ కుమారి(13) బిహార్లోని బిహ్తాలో ఇటుకల బట్టీలో పనిచేస్తోంది. మిగిలిన ముగ్గురు పిల్లల(అక్షయ్(9), దీపావళి(3), నెలల వయసున్న పాప)తో కలిసి ఝార్ఖండ్ గుమ్లా జిల్లా అంబేడ్కర్ నగర్లో ఉంటున్నారు గుడియా దేవి దంపతులు.
భజరంగ్ నాయక్ పాత సామాను సేకరించి, అమ్మితే వచ్చే సంపాదనే వారికి ఆధారం. తలదాచునేందుకు ఇల్లు కూడా లేదు. పాత సామాను భద్రపరిచే రేకుల షెడ్డే వారికి ఆధారం. గుడియా దేవి కుటుంబం చాలీచాలని తిండి తింటూ, శీతాకాలం చలిలో ఆరుబయటే నిద్రిస్తూ ప్రత్యక్ష నరకం చూసిన రోజులు ఎన్నో..
ఇవి చాలదన్నట్టు గుడియా దేవి కొంతకాలం క్రితం తీవ్ర అనారోగ్యానికి గురైంది. స్థానికులు కొందరు గుమ్లా సదర్ ఆస్పత్రిలో చేర్చగా.. ఆమెకు క్షయ వ్యాధి ఉన్నట్లు నిర్ధరణ అయింది. కానీ.. చికిత్స పూర్తి కాకుండానే కొన్ని రోజులకే ఆస్పత్రి నుంచి పారిపోయి వచ్చిందామె.