దేశవ్యాప్తంగా కరోనా సెకండ్ వేవ్ కొనసాగుతుంటే.. మహారాష్ట్రలో కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టాయి. వైరస్ నుంచి కోలుకుంటున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతోందని మహారాష్ట్ర కొవిడ్ కార్యదళ నిర్వాహక కమిటీ సభ్యుడు డాక్టర్ సంజయ్ ఓక్ తెలిపారు. అయితే గణాంకాలను చూసి మహమ్మారి తగ్గిపోయిందని అనుకోవద్దని 'ఈటీవీ భారత్'కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. మహారాష్ట్రలోని కొన్ని జిల్లాల్లో కరోనా మూడో దశ వచ్చే అవకాశం ఉందన్నారు.
మహారాష్ట్రలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టినా మరణాల రేటు ఇంకా అధికంగానే ఉంది. దీనికి కారణం?
కొవిడ్ లక్షణాలు ఉన్నవారు ఇంటివద్దే చికిత్స పొందుతున్నారు. పరిస్థితి క్లిష్టంగా ఉంటేనే ఆస్పత్రికి వస్తున్నారు. అలాగే, రాష్ట్రంలో డయాబెటిస్ రోగులు అధికంగా ఉన్నారు. అందువల్ల మరణాల రేటు అధికంగా నమోదవుతోంది.
కరోనా మూడోదశ దృష్ట్యా రాష్ట్రంలో ఎలాంటి చర్యలు తీసుకున్నారు?
రాష్ట్రంలో ప్రస్తుతం కరోనా రెండో దశ ఉంది. మూడో దశ జులైలో వచ్చే అవకాశం ఉంది. ఈ దశ చిన్నపిల్లలపై అధిక ప్రభావం చూపనుంది. అయితే మూడో దశ సన్నాహక చర్యల కోసం రాష్ట్రం ఇప్పటికే ఓ కార్యదళ కమిటీని ఏర్పాటు చేసింది. వైరస్ మూడో దశ దృష్ట్యా ఆస్పత్రిలో పడకలు, వెంటిలేటర్ల సామర్థ్యం పెంచేందుకు చర్యలు చేపట్టాలి. అవసరమైతే పిల్లల కోసం ప్రత్యేక ఆసుపత్రులను ఏర్పాటు చేయాలి. చిన్నారులకు వ్యాక్సినేషన్ ప్రక్రియను ప్రారంభించాలి.