తెలంగాణ

telangana

ETV Bharat / bharat

మోదీ విదేశీ పర్యటనలు.. ఐదేళ్లలో రూ.239 కోట్లు ఖర్చు - ప్రధాని మోదీ

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విదేశీ పర్యటనల కోసం గత ఐదేళ్లలో రూ.239 కోట్లు ఖర్చు చేసినట్లు కేంద్ర విదేశాంగ శాఖ వెల్లడించింది. అత్యధిక ఖర్చు అమెరికా పర్యటనకు కాగా.. అత్యల్పంగా జపాన్‌ పర్యటనకు అయినట్లు తెలిపింది.

prime minister modi
ప్రధాని మోడీ

By

Published : Dec 8, 2022, 10:32 PM IST

Modi Foreign Trips: ప్రధానమంత్రి హోదాలో నరేంద్ర మోదీ విదేశాల్లో అధికారిక పర్యటనలు చేస్తుంటారు. ఈ క్రమంలో గత ఐదేళ్లలో ప్రధాని విదేశీ పర్యటనల కోసం రూ.239కోట్లు ఖర్చయినట్లు వెల్లడైంది. గడిచిన ఐదేళ్లలో విదేశీ ప్రయాణాలు, వాటికైన ఖర్చులకు సంబంధించిన వివరాలను తెలపాలని సభ్యులు అడిగిన ప్రశ్నకు కేంద్ర విదేశాంగశాఖ సహాయ మంత్రి వీ మురళీధరన్‌ రాజ్యసభలో లిఖితపూర్వక సమాధానమిచ్చారు.

'వివిధ దేశాలతో సన్నిహిత సంబంధాలను పెంపొందించుకోవడంతోపాటు స్థానిక, అంతర్జాతీయ స్థాయిలో భారత కార్యకలాపాలను మరింత విస్తరించడమే ప్రధానమంత్రి విదేశీ పర్యటనల లక్ష్యం. దేశ ప్రయోజనాలతోపాటు విదేశాంగ విధాన లక్ష్యాలను చేరుకునేందుకు ఇటువంటి పర్యటనలు ఎంతో ముఖ్యం. అంతర్జాతీయ నేరాలు, వాతావరణ మార్పులు, ఉగ్రవాదం, సైబర్‌ సెక్యూరిటీతోపాటు ఇతర అంతర్జాతీయ అంశాలపై ప్రపంచ అజెండాను రూపొందించే ప్రయత్నంలో భాగంగా ప్రధానమంత్రి విదేశీ పర్యటనలు ఉంటాయి' అని కేంద్ర విదేశాంగ సహాయ మంత్రి వెల్లడించారు.

ఐదేళ్లలో మొత్తం 36 విదేశీ పర్యటనలు చేయగా అందులో 31 పర్యటనలకు బడ్జెట్‌ నుంచి ఖర్చు చేసినట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. నవంబర్‌ 2017లో ప్రధాని మోదీ తొలుత ఫిలిప్పైన్స్‌లో పర్యటించారు. 2021లో బంగ్లాదేశ్‌, అమెరికా, బ్రిటన్‌, ఇటలీ పర్యటనలు చేశారు. ఇలా మొత్తంగా ఇప్పటివరకు రూ.239కోట్లు ఖర్చు అయ్యిందని ప్రభుత్వం తెలిపింది. వీటిలో అత్యధికంగా అమెరికా పర్యటన కోసం రూ.23కోట్లు కేటాయించగా.. ఈ ఏడాది (సెప్టెంబర్‌ 26-28) జపాన్‌ పర్యటనకు అత్యల్పంగా రూ.23లక్షలు ఖర్చయినట్లు పేర్కొంది. 2019 సెప్టెంబర్‌ 21 నుంచి 28 తేదీల్లో ప్రధాని మోదీ అమెరికాలో పర్యటించారు.

ABOUT THE AUTHOR

...view details