EC Comments On Free Schemes: ఎన్నికలకు ముందు లేదా ఆ తర్వాత ఉచిత హామీలివ్వడం లేదా ఉచితాలను పంపిణీ చేయడమన్నది ఆయా పార్టీల విధాన నిర్ణయమనీ... అవి రాష్ట్రానికి ఆర్థికంగా లాభదాయకమా? లేదా ప్రతికూల ప్రభావం చూపుతాయా? అన్నది ఆయా రాష్ట్ర ఓటర్లే నిర్ణయిస్తారనీ భారత ఎన్నికల సంఘం పేర్కొంది. ఈ మేరకు సుప్రీంకోర్టుకు అఫిడవిట్ సమర్పించింది.
ఎన్నికలకు ముందు అసంబద్ధ ఉచిత వాగ్దానాలు చేసే, ప్రజాధనాన్ని ఉచితంగా పంపిణీ చేసే రాజకీయ పార్టీల ఎన్నికల గుర్తులనూ, వాటి రిజిస్ట్రేషన్‌నూ రద్దు చేయాలంటూ... న్యాయవాది అశ్వనీ కుమార్ దుబే ద్వారా సుప్రీంకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. ఇందుకు అనుగుణంగా చట్టం చేసేలా కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని కూడా సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆయన అభ్యర్థించారు. దీనిని పరిగణనలోకి తీసుకున్న న్యాయస్థానం... పిటిషన్‌పై స్పందన తెలియజేయాలంటూ కేంద్ర ప్రభుత్వాన్ని, ఎన్నికల సంఘాన్ని ఈ ఏడాది జనవరి 25న ఆదేశించింది. ఈ మేరకు ఎన్నికల సంఘం తన స్పందనను తెలియజేసింది.
అఫిడవిట్‌లో ఏం చెప్పిందంటే.."గెలిచిన పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసిన తర్వాత తీసుకునే విధాన నిర్ణయాలను ఎన్నికల సంఘం నియంత్రించలేదు. చట్టం పేర్కొనని అలాంటి చర్యలను తీసుకోవడం అధికార పరిధిని అతిక్రమించడమే అవుతుంది. ఎన్నికల సంస్కరణల్లో భాగంగా రాజకీయ పార్టీలకు సంబంధించి 2016 డిసెంబరులో కేంద్ర ప్రభుత్వానికి 47 ప్రతిపాదనలను పంపాం. ఇందులో రాజకీయ పార్టీల రద్దు అంశం కూడా ఉంది. రాజకీయ పార్టీల నమోదు, రద్దు వంటి అంశాలను నియంత్రించేందుకూ, ఇందుకు అవసరమైన ఉత్తర్వులు జారీచేసేందుకూ అధికారాలను దఖలు పరచాలని కోరుతూ భారత న్యాయశాఖకు కూడా ప్రతిపాదనలు పంపాం. ఎన్నికల గుర్తును స్వాధీనం చేసుకునేందుకూ... ఉచిత హామీలు, పంపిణీ చేపట్టే రాజకీయ పార్టీల రిజిస్ట్రేషన్‌ను రద్దు చేసేందుకూ ఎన్నికల సంఘాన్ని అనుమతించాలని కోరుతూ అశ్వనీకుమార్ ఉపాధ్యాయ గతంలో ఓ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై సుప్రీంకోర్టు 2002లో తీర్పు వెలువరించింది. మూడు సందర్భాల్లో మినహా రాజకీయ పార్టీల రిజిస్ట్రేషన్‌ను రద్దుచేసే అధికారం ఎన్నికల సంఘానికి లేదని ఆ సందర్భంగా స్పష్టం చేసింది. 1) ఫోర్జరీ, మోసం ద్వారా ఏదైనా పార్టీ రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పుడు, 2) నమోదిత రాజకీయ పార్టీ తన నియమ నిబంధనలను మార్చుకున్నప్పుడు, 3) రాజ్యాంగం పట్ల విశ్వాసం లేదని, విధేయత చూపలేమని సదరు పార్టీ తెలియజేసినప్పుడు మాత్రమే ఆ రాజకీయ పార్టీల రిజిస్ట్రేషన్‌ను రద్దు చేయవచ్చని పేర్కొంది. ఆ తీర్పు ప్రకారం... పిటిషనర్ కోరినట్టు ఉచిత హామీలు, ఉచిత పంపిణీలు చేసే రాజకీయ పార్టీల రిజిస్ట్రేషన్‌ను రద్దు చేసే అధికారం ఎన్నికల సంఘానికి లేదు.
పోటీకి ముందే ఉనికి కోల్పోతాయి..రాజకీయ పార్టీలు ఎన్నికల్లో కనబరిచే పనితీరు ఆధారంగా గుర్తింపు పొందతున్నాయి. ఉచిత వాగ్దానాలు, పంపిణీలు చేయకూడదన్న నిబంధన వల్ల ఎన్నికల్లో పోటీ చేయకముందే ఆయా పార్టీలు తమ ఉనికి కోల్పోయే ప్రమాదముంది. మేనిఫెస్టోల్లో పేర్కొనే హామీల అమలు అంశం ఎన్నికల చట్టం పరిధిలోని అంశం కాదు. అయినప్పటికీ- గుర్తింపు పొందిన పార్టీలన్నీ తమ మేనిఫెస్టోలను, అందులో పేర్కొన్న కార్యక్రమాలను అమలుచేస్తామన్న డిక్లరేషన్‌ను సమర్పించాలని 2016లోనే సూచించాం" అని ఎన్నికల సంఘం పేర్కొంది.
ఇదీ చదవండి: 'మధ్యవర్తిత్వానికి దేశ న్యాయ ముఖచిత్రాన్ని మార్చే శక్తి'