బంగాల్లో ఆరో దఫా ఎన్నికల ప్రచార గడువు సోమవారం సాయంత్రంతో ముగిసింది. 43 అసెంబ్లీ స్థానాల్లో.. ఈ నెల 22న(గురువారం) ఓటింగ్ జరగనుంది. రాష్ట్రంలో కరోనా కేసులు విస్తరిస్తున్న వేళ ఎన్నికల సంఘం అప్రమత్తమైంది. ఈ మేరకు ఓటింగ్‌కు మూడు రోజుల ముందే ప్రచారం ముగించాలని ఆయా పార్టీలకు సూచించింది. అంతకుముందున్న నిబంధనల ప్రకారం.. పోలింగ్ తేదీకి 48 గంటల ముందువరకు ప్రచారం నిర్వహించేందుకు వీలుండేది. చివరి మూడు దఫాల ఓటింగ్‌కూ ఈ నిబంధనలు వర్తిస్తాయని ఈసీ స్పష్టం చేసింది.
ఉత్తర 24 పరగణాలు-17, నదియా-9, ఉత్తర్ దినాజ్‌పుర్-9, పూర్వ బర్ధామన్-8 స్థానాలకు గానూ... 14,480 పోలింగ్ కేంద్రాల్లో ఓటింగ్ జరగనుంది. 1.03 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుంటుండగా.. 306 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. వారిలో భాజపా జాతీయ ఉపాధ్యక్షుడు ముకుల్ రాయ్, తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) సీనియర్ నేతలు జ్యోతిప్రియ మల్లిక్, చంద్రిమ భట్టాచార్య, సీపీఐ(ఎం) తరఫున తన్మయ్ భట్టాచార్య ఉన్నారు. వీరితో పాటు టీఎంసీ తరఫున బరిలోకి దిగనున్న సినీ దర్శకుడు రాజ్ చక్రవర్తి, నటి కౌషాని ముఖర్జీల భవితవ్యమూ ఇందులో తేలనుంది.