ఈశాన్య భారతాన్ని భారీ భూకంపం వణికించింది. బిహార్‌లో 6.7 తీవ్రతో భూమి కంపించింది. అసోంలోని సోనిత్‌పూర్‌లో.. రిక్టర్ స్కేలుపై 6.4 తీవ్రతతో భూకంపం సంభవించినట్లు జాతీయ భూవిజ్ఞాన కేంద్రం తెలిపింది. భూకంప కేంద్రం సోనిత్‌పూర్ జిల్లాలోని తేజ్‌పుర్‌కు 43 కిలోమీటర్ల దూరంలో 17 కిలోమీటర్ల లోతులో ఉన్నట్లు పేర్కొంది. ఉదయం 7గంటల 51 నిమిషాల ప్రాంతంలో భూమి మూడు సార్లు కంపించినట్లు తెలిపింది. 7గంటల 58 నిమిషాల ప్రాంతంలో 4.3 తీవ్రతతో 8 గంటల ఒక్క నిమిషం ప్రాంతంలో 4.4 తీవ్రతతో భూమి కంపించినట్లు వివరించింది.
బంగాల్ సహా ఇతర ఈశాన్య రాష్ట్రాలు మేఘాలయలోనూ ప్రకంపనలు చోటు చేసుకున్నట్లు కూడా జాతీయ భూవిజ్ఞాన కేంద్రం తెలిపింది. భూమి మూడుసార్లు కంపించినట్లు వెల్లడించింది. భూకంపానికి భయాందోళనకు గురైన స్థానికులు ఇళ్లలో నుంచి బయటకు పరుగులు తీశారు. భూకంప తీవ్రతకు గువహటిలో కొన్ని చోట్ల భవంతులు దెబ్బతిన్న చిత్రాలను అసోం ఆరోగ్య మంత్రి హిమంత బిశ్వ శర్మ ట్వీట్ చేశారు. భూకంపం ధాటికి ఇప్పటి వరకూ ఏ విధమైన ప్రాణనష్టం జరిగిన దాఖలాలు లేవని పేర్కొన్నారు. స్థానిక యంత్రాగం నుంచి సమాచారం సేకరిస్తున్నామని సహాయచర్యలు ముమ్మరం చేయాలని ఆదేశించామని హిమంత వివరించారు. సామాజిక మాధ్యమాల్లో తన ఇళ్లు భూకంప తీవ్రతకు బీటలు వారాయంటూ కొందరు ఫొటోలు పెడుతున్నారు.