Dog Bite Compensation : దేశవ్యాప్తంగా కుక్కల దాడులు విపరీతంగా పెరిగిపోయాయి. ఈ క్రమంలో శునకం దాడికి సంబంధించిన కేసులో పంజాబ్-హరియాణా హైకోర్టు ఆసక్తికర తీర్పు వెలువరించింది. వీధి శునకాలు, ఇతర జంతువుల దాడి కేసులో పరిహారం చెల్లించాల్సిన ప్రాథమిక బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదేనని స్పష్టం చేసింది. కుక్కకాటుకు గురైన వ్యక్తికి ఒక్కో పంటి గాటుకు కనీసం రూ.10వేలు చెల్లించాలని, తీవ్ర గాయమైతే (0.2 సెం.మీ మేర కోతపడినట్లయితే) రూ.20వేల పరిహారం అందించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.
వీధుల్లో ఉండే మూగజీవాల దాడులకు సంబంధించి దాఖలైన 193 పిటిషన్లను పంజాబ్-హరియాణా హైకోర్టు విచారించి, తీర్పు ఇచ్చింది. 'కుక్కల దాడులకు సంబంధించి బాధితులకు పరిహారం చెల్లించే ప్రాథమిక బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదే. వీటిని సంబంధిత ప్రభుత్వ విభాగం లేదా ప్రైవేటు వ్యక్తుల నుంచి రికవరీ చేసే హక్కు ప్రభుత్వానికి ఉంది' అని పంజాబ్-హరియాణా హైకోర్టు ధర్మాసనం తీర్పులో పేర్కొంది. ఆవులు, ఎద్దులు, గాడిదలు, శునకాలు, గేదెలతోపాటు అడవి, పెంపుడు జంతువుల దాడుల్లో చెల్లించాల్సిన పరిహారాన్ని నిర్ణయించేందుకు ఓ కమిటీని నియమించాలని పంజాబ్, హరియాణాతోపాటు చండీగఢ్ పాలనా విభాగాలకు సూచించింది. క్లెయిమ్ దాఖలు చేసిన నాలుగు నెలల వ్యవధిలో పరిహారాన్ని ఆమోదించాలని తెలిపింది.
రోడ్లపై విచ్చలవిడిగా సంచరించే పశువులు, ఇతర జంతువుల వల్ల జరిగే రోడ్డు ప్రమాదాల్లో బాధితులకు పరిహారం చెల్లించడానికి కూడా ఒక కమిటీని వేయాలని పంజాబ్-హరియాణా హైకోర్టు ఆదేశించింది. ఈ మేరకు పంజాబ్, హరియాణాతోపాటు చండీగఢ్ పాలనా విభాగాలకు ఆదేశాలు జారీ చేసింది. ఈ కమిటీలో సంబంధిత జిల్లా డిప్యూటీ కమిషనర్, డీఎస్పీ, ఎస్డీఎం, డీటీఓ, చీఫ్ మెడికల్ ఆఫీసర్ తదితరులు ఉంటారు.