doctors declared man dead: ఉత్తరాఖండ్‌లో ఓ ప్రైవేట్ ఆసుపత్రి నిర్లక్ష్యం బయటపడింది. రోగి బతికుండగానే మరణించాడని వైద్యులు నిర్ధరించారు. కరణ్పుర్కు చెందిన అజాబ్ సింగ్(60) అనే రోగికి బీపీ తగ్గిపోవడం వల్ల లక్సర్‌లోని హిమాలయన్ ఆసుపత్రిలో కుటుంబ సభ్యులు చేర్పించారు. నాలుగు రోజుల పాటు వెంటిలేటర్ పెట్టి చికిత్స అందించారు వైద్యులు. శుక్రవారం.. అజాబ్ సింగ్ మరణించాడని ధ్రువీకరించి వెంటిలేటర్‌ను తొలగించారు. ఎంత ప్రయత్నించినా రోగి ఆరోగ్య పరిస్థితి మెరుగుపడలేదని కుటుంబసభ్యులకు తెలిపారు.
రోగి కుటుంబం నుంచి నాలుగు రోజుల వైద్యానికి రూ.1,70,000 రూపాయలు వసూలు చేసింది ఆసుపత్రి యజమాన్యం. ఈ ఘటన శుక్రవారం జరిగింది. ఇక వృద్ధుడికి పెట్టిన వెంటిలేటర్‌ను తొలగించి కుటుంబ సభ్యులకు అప్పగించేశారు. కుటుంబ సభ్యులు బాధతో అంత్యక్రియలకు ఏర్పాట్లు చేశారు. అంత్యక్రియలకి ముందు వృద్ధునికి స్నానం చేయిస్తుండగా అతడు కదలడం, శ్వాస తీసుకోవడం కుటుంబ సభ్యులు గమనించారు. వెంటనే లక్సర్‌లోని మరో ఆసుపత్రికి తరలించి వైద్యం చేయించారు.