Doctor Left The Surgery Due To Not Getting A Tea: టీ ఇవ్వలేదని సర్జరీ పూర్తి కాకుండానే ఆపరేషన్ థియేటర్ నుంచి ఓ డాక్టర్ బయటకు వచ్చేశాడు. ఈ ఘటన మహారాష్ట్రలోని నాగ్‌పుర్ జిల్లాలో జరిగింది. సర్జరీ చేయకుండా డాక్టర్ వచ్చేసిన ఘటనపై విచారణ జరిపేందుకు ప్రభుత్వం ఓ కమిటీని వేసింది.
జిల్లాలోని ఖట్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించుకోవడానికి నలుగురు మహిళలు వచ్చారు. వాళ్లకి శస్త్ర చిక్సిత చేసేది డాక్టర్ తేజ్‌రామ్ భలవి. సర్జరీ చేయటానికి వెళ్లే ముందు టీ కోసం అక్కడ వాళ్లని అడిగారు వైద్యుడు. అయితే ఎవరూ డాక్టర్‌కు టీ ఇవ్వలేదు. ఈ క్రమంలో డాక్టర్ తేజ్‌రామ్ సర్జరీ చేసేందుకు ఆపరేషన్ థియేటర్‌కు వెళ్లారు. నలుగురు మహిళలకు మత్తు మందు ఇచ్చారు. టీ ఇవ్వలేదనే కోపంతో డాక్టర్ సర్జరీ చేయకుండానే ఆపరేషన్ థియేటర్ నుంచి బయటకు వెళ్లిపోయాడు. దీంతో ఆపరేషన్ కోసం మత్తు మందు ఇచ్చిన నలుగురు మహిళలు ఎదురుచూడాల్సి వచ్చింది.
టీ ఇవ్వకపోవటం వల్ల డాక్టర్ సర్జరీలు చేయకుండా వదిలేశాడని.. వెంటనే జిల్లా యంత్రాంగం మరో డాక్టర్‌ను ఏర్పాటు చేసింది. ఇలా చేసినందుకు జిల్లా యంత్రాంగం డాక్టర్‌ను విచారించేందుకు ముగ్గురు సభ్యులతో కూడిన కమిటీని ఏర్పాటు చేసింది. ఈ విషయంపై జిల్లా పరిషత్ ఉపాధ్యక్షులు కుందా రౌత్ స్పందించారు. టీ రాకపోవటం వట్ల డాక్టర్ సర్జరీ చేయకుండా వెళ్లినందుకు కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. డాక్టర్ ఈ ప్రవర్తన కారణంగా ఆపరేషన్ కోసం మత్తు మందు ఇచ్చిన నలుగురు మహిళలు వేచి ఉండాల్సిన పరిస్థితి వచ్చినందుకు బాధగా ఉందని అన్నారు. అలానే డాక్టర్ తేజ్‌రామ్ భలవిపై ఐపీసీ 304 సెక్షన్ కింద ఫిర్యాదు చేయాలని డిమాండ్ చేశారు.