తెలంగాణ

telangana

ETV Bharat / bharat

vaccine certificate: 'సోషల్​ మీడియాలో వ్యాక్సిన్​ సర్టిఫికెట్​ వద్దు' - టీకా ధ్రువపత్రం

కరోనా టీకా డోసును తీసుకున్న వెంటనే ప్రభుత్వం అందించే ధ్రువీకరణ పత్రాన్ని చాలా మంది సామాజిక మాధ్యమాల్లో పంచుకుంటున్నారు. అయితే ఇలా ఇతరులతో పంచుకోవడాన్ని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ తప్పుపట్టింది. అలా పంచుకోవడం వల్ల వ్యక్తిగత సమాచారం దుర్వినియోగం అయ్యే ప్రమాదం ఉందని తెలిపింది.

vaccine certificate
వ్యాక్సిన్‌ సర్టిఫికెట్‌ సామాజిక మాధ్యమాల్లో వద్దు

By

Published : May 27, 2021, 5:02 AM IST

Updated : May 27, 2021, 6:15 AM IST

కొవిడ్‌ టీకా తీసుకున్న తర్వాత ప్రభుత్వం అందించే ధ్రువీకరణ పత్రాన్ని సామాజిక మాధ్యమాల్లో పంచుకోవద్దని కేంద్ర హోం మంత్రిత్వశాఖ హెచ్చరికలు జారీ చేసింది. అలా పంచుకోవడం వల్ల వ్యక్తిగత సమాచారం దుర్వినియోగం అయ్యే ప్రమాదం ఉందని స్పష్టం చేసింది.

'అందులో పేరు, ఇతర వ్యక్తిగత వివరాలు ఉన్నందున వ్యాక్సినేషన్‌ సర్టిఫికెట్‌ను పంచుకోవడంలో జాగ్రత్తలు వహించండి. సైబర్‌ మోసగాళ్లు వ్యక్తిగత సమాచారాన్ని దుర్వినియోగం చేసే అవకాశం ఉంది. కాబట్టి సామాజిక మాధ్యమాల్లో టీకా సర్టిఫికెట్‌ పంచుకోరాదు' అని కేంద్ర హోం మంత్రిత్వశాఖ సైబర్‌ దోస్త్‌ ట్విటర్‌ ఖాతా ద్వారా తెలిపింది.

కరోనా టీకా మొదటి మోతాదు తీసుకున్న తర్వాత తదుపరి మోతాదు ఎప్పుడు తీసుకోవాలి, వ్యాక్సిన్‌ వివరాలు, ఇతర వ్యక్తిగత వివరాలతో తాత్కాలికంగా ఒక ధ్రువీకరణ పత్రాన్ని ప్రభుత్వం జారీ చేస్తుంది. టీకా రెండు డోసులు తీసుకున్న తర్వాత వచ్చే తుది ధ్రువీకరణ పత్రం ముఖ్యమైంది. భవిష్యత్తులో ఆ సర్టిఫికెట్ ఇతరత్రా ఉపయోగపడనుంది.

మీ టీకా సర్టిఫికెట్‌ను అధికారిక కొవిన్‌ వెబ్‌సైట్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. ఎలాగంటే.. కొవిన్‌ వైబ్‌సైట్‌లోకి వెళ్లి మొబైల్‌ నెంబర్‌తో లాగిన్‌ అవ్వాలి. ఒకసారి లాగిన్‌ అయితే, మీ మొబైల్‌ నంబర్‌తో ఎంతమంది రిజిస్టర్‌ అయ్యారో జాబితాను చూపిస్తుంది. అక్కడే రెండు డోసులు తీసుకున్నవారి పేర్ల వద్ద 'వ్యాక్సినేటెడ్‌' అని గ్రీన్‌ బ్యానర్‌లో కనిపిస్తుంది. కుడి వైపున 'సర్టిఫికెట్‌' అనే బటన్ కనబడుతుంది. దానిపై క్లిక్‌ చేస్తే పీడీఎఫ్‌ ఫార్మాట్‌లో డౌన్‌లోడ్‌ అవుతుంది. దాన్ని తీసుకొని భద్రపరచుకోవాలి.

అలాగే, ఆరోగ్యసేతు యాప్‌ ద్వారా కూడా టీకా ధ్రువీకరణ పత్రాన్ని డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. కొవిన్‌ ట్యాబ్‌లో అధికారిక వెబ్‌సైట్‌లో 'వ్యాక్సినేషన్‌ సర్టిఫికెట్‌' అనే ఆప్షన్‌ ఉంటుంది. లబ్ధిదారుడి 13 అంకెల రెఫరెన్స్‌ ఐడీని ఎంటర్‌ చేయగానే వివరాలు వస్తాయి. దాని కింద ఉన్న 'గెట్‌ సర్టిఫికెట్‌' అనే బటన్‌పై క్లిక్‌ చేసి వ్యాక్సిన్‌ సర్టిఫికెట్‌ను పొందవచ్చు.

ఇదీ చూడండి:కరోనా కట్టడిపై భారత్​కు లాన్సెట్ 8 సూచనలు

Last Updated : May 27, 2021, 6:15 AM IST

ABOUT THE AUTHOR

...view details