తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఉద్యోగం కోసం పట్టు వదలకుండా వేట.. వరుసగా 600 మెయిల్స్​.. చివరకు జాక్​పాట్!

అమెరికాలో చదివి సరైన ఉద్యోగం దొరకలేదని దిగులు పడ్డాడు ఆ యువకుడు. ఇంత దూరం వచ్చి మనం ఏం సాధించకపోతే ఎలా అని బాధపడుతున్న సమయంలో అదృష్టం అతడ్ని ప్రపంచ బ్యాంక్ రూపంలో వరించింది. 23 ఏళ్లకే ప్రపంచ బ్యాంక్​లో కొలువు కొట్టేసి అందరినీ ఆశ్చర్యపరిచాడు. తన జర్నీని ఓ సామాజిక వేదిక ద్వారా పంచుకున్నాడు.

delhi boy in world bank
vatsal nahata

By

Published : Sep 27, 2022, 6:52 AM IST

Delhi boy in World bank : అమెరికాలో ఉన్నత చదువు ఆశయం..యూఎస్‌లోని ప్రఖ్యాత యూనివర్సిటీలో సీటు..విజయవంతంగా కోర్సు పూర్తి..అయినా దక్కని ఉద్యోగం..ఇప్పుడెలా? ఈ పరిస్థితి ఎదుర్కోవడానికేనా ఇంత దూరం వచ్చింది.. ఇంత గొప్పగా చదివింది అన్న సంఘర్షణ..సీన్‌ కట్‌ చేస్తే 23 ఏళ్లు నిండని ఆ కుర్రాడు ఇప్పుడు ప్రపంచబ్యాంకులో కొలువు కొట్టేసి ఎందరికో ఆదర్శమైపోయాడు. ఈ ఘనత తానెలా సాధించానన్నది అతడు లింక్డ్‌ఇన్‌ వేదికగా పంచుకోగా అది వైరల్‌గా మారింది. దానిని ఇప్పటి వరకూ 15వేల మంది లైక్‌ చేశారు. అనేకమంది షేర్‌ చేశారు.

యేల్‌ యూనివర్సిటీలో సీటు
దిల్లీలోని శ్రీరాం కాలేజ్‌ ఆఫ్‌ కామర్స్‌లో అర్థశాస్త్రంలో డిగ్రీ పూర్తిచేసిన వత్సల్‌ నహతా ఉన్నత చదువుకు అమెరికాలోని 'యేల్‌' యూనివర్సిటీలో సీటు సంపాదించాడు. 2020లో కొవిడ్‌ మహమ్మారి ఉద్ధృతంగా కొనసాగుతున్న సమయంలో అతడి మాస్టర్స్‌ డిగ్రీ పూర్తికావచ్చింది. అయినా ఏ ఉద్యోగం సాధించలేకపోయాడు. 'కరోనా నేపథ్యంలో పలు కంపెనీలు ఉద్యోగులను తొలగించేందుకు చూస్తున్న రోజులవి' అంటూ తన పోస్టును మొదలుపెట్టాడు ఆ యువకుడు.

పరిచయాలపై దృష్టి
"మరో 2 నెలల్లో గ్రాడ్యుయేషన్‌ పూర్తికావస్తున్నా నా చేతిలో ఎలాంటి ఉద్యోగం లేదు. నేను యేల్‌ విశ్వవిద్యాలయ విద్యార్థిని. కనీసం ఓ ఉద్యోగం సాధించలేని వాడిని ఈ వర్సిటీకి రావడం ఎందుకు అని నన్ను నేనే ప్రశ్నించుకున్నా. ఏం చేస్తున్నావు అని నా తల్లిదండ్రులు ఫోన్‌లో పలకరించినప్పుడు సమాధానం ఇవ్వడం కష్టంగా అనిపించింది. భారత్‌కు తిరిగి వెళ్లడం సరైన నిర్ణయం కాదనుకున్నా. నా మొదటి సంపాదన డాలర్లలోనే ఉండాలని నిశ్చయించుకున్నా. ఉద్యోగ దరఖాస్తులు(జాబ్‌ అప్లికేషన్‌ ఫారమ్‌), కొలువు పోర్టల్‌లు కాకుండా సామాజిక మాధ్యమాల్లో పరిచయాల(నెట్‌వర్కింగ్‌)పై దృష్టిపెట్టాను".

4 సంస్థల్లో ఉద్యోగాలు
రెండు నెలల వ్యవధిలో వదలకుండా 1,500 స్నేహ అభ్యర్థన(కనెక్షన్‌ రిక్వెస్టు)లు పంపా. విసుగు చెందకుండా 600 ఈ-మెయిల్స్‌ చేశాను. పలు సంస్థలకు 80 కాల్స్‌ చేశాను. అయినా నా ప్రయత్నాలు పెద్ద సంఖ్యలో తిరస్కరణకు గురయ్యాయి. చివరకు నాలుగు సంస్థలు నాకు ఉద్యోగం ఇచ్చేందుకు ముందుకొచ్చాయి. వాటిలో నేను ప్రపంచ బ్యాంకును ఎంచుకున్నా. ప్రపంచ బ్యాంక్‌ డైరెక్టర్‌తో కలిసి పనిచేసేందుకు అవకాశం కల్పించారు. 23 సంవత్సరాల వయసు గలవారికి ఇది గొప్ప విషయమే.

ప్రయత్నిస్తూ ఉంటే మంచి రోజులొస్తాయి
"కష్ట సమయంలో నేను కొన్ని పాఠాలు నేర్చుకున్నా. ఎవరూ ప్రయత్నాన్ని విరమించి వెనకడుగు వేయకూడదనే ఉద్దేశంతోనే నా గాథను ఇలా పంచుకుంటున్నా. ఎలాంటి పరిస్థితుల్లోనైనా ముందుకే సాగండి. చిన్నచిన్న వాటితో సంతృప్తిపడకండి. తప్పుల నుంచి నేర్చుకొండి. వదలకుండా ప్రయత్నిస్తూ ఉంటే మంచిరోజులు అవే వస్తాయి" అంటూ నహతా తన పోస్ట్‌లో వివరించాడు.

ఇదీ చదవండి:ప్యాసింజర్​కు CPR చేసి ప్రాణాలు కాపాడిన జవాన్​​.. వీడియో వైరల్​!

CUET-UG ఫలితాలు విడుదల.. మీ ర్యాంకు​ చెక్ చేసుకున్నారా?

ABOUT THE AUTHOR

...view details