Minor Gang Rape In Delhi: 13 ఏళ్ల బాలికను కిడ్నాప్ చేసి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు దుండగులు. ఈ దారుణం దేశ రాజధాని దక్షిణ దిల్లీ ప్రాంతంలో జరిగింది. ఈ ఘటనలో ముగ్గురు వ్యక్తులను అరెస్ట్ చేసినట్లు పోలీసులు వెల్లడించారు. అత్యాచారానికి పాల్పడ్డ వారిని మోహిత్(20), ఆకాశ్(19), షారుక్(20)గా గుర్తించారు. వీరితో పాటు మరో బాలనేరస్థుడిని అదుపులోకి తీసుకున్నామన్నారు. నిందితులపై పోక్సో చట్టంతో పాటు పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. బాలికను వైద్య పరీక్షల నిమిత్తం ఏయిమ్స్ ఆస్పత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు.
పోలీసుల కథనం ప్రకారం.. దక్షిణ దిల్లీకి చెందిన 13 ఏళ్ల బాలిక ఏప్రిల్ 24 సాయంత్రం 5 గంటలకు ఇంటి నుంచి కూరగాయల కోసం మార్కెట్‌కు బయలుదేరింది. శనిబజార్లో ఆటో ఎక్కిన బాలికను డ్రైవర్ షారుక్.. మార్కెట్‌కు బదులు ఓఖ్లాకి తీసుకెళ్లాడు. అనంతరం తన స్నేహితులైన ఆకాశ్, మరో బాలుడిని పిలిచి.. ఆమెకు శీతల పానీయంలో డ్రగ్స్ కలిపి ఇచ్చారు. తర్వాత ఆమెను టిగ్రీలోని జేజే క్యాంపునకు తీసుకువెళ్లారు. అక్కడ మరో నిందితుడు సల్మాన్‌తో కలిసి ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. రాత్రంతా అక్కడే గడిపిన వారు.. మరుసటి రోజు ఉదయం బాలికను మథురలోని కోసి కలాన్‌కు తీసుకువచ్చారు. తర్వాత రోజు దిల్లీలోని టిగ్రీ ప్రాంతంలో వదిలిపెట్టి వెళ్లారు.