Delhi excise policy : దిల్లీ ఎక్సైజ్ విధానంలో అవకతవకలకు సంబంధించిన కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. తాజాగా భాజపాలో చేరితే కేసులన్నీ ఎత్తివేస్తామంటూ తనను సంప్రదించారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు దిల్లీ ఉపముఖ్యమంత్రి మనీశ్ సిసోదియా. ఆమ్ ఆద్మీ పార్టీని విభజిస్తే ముఖ్యమంత్రిని చేస్తామంటూ భాజపా ఆఫర్ ఇచ్చిందని పేర్కొన్నారు. అయితే, వీటిని తాను ఖండించినట్లు చెప్పారు. "మహారాణా ప్రతాప్, రాజ్‌పుత్ వారసుడిని. తల నరక్కుంటాను. కానీ మీలాంటి కుట్రదారులు, అవినీతిపరుల ముందు ఎన్నటికీ తల వంచను" అని సమాధానం ఇచ్చానని సిసోదియా చెప్పారు.
"భాజపా నుంచి నాకు ఓ సందేశం అందింది. ఆప్‌ను విడిచిపెట్టి భాజపాలో చేరితే.. సీబీఐ, ఈడీ పెట్టిన కేసులన్నీ మూసేస్తామన్నారు. పార్టీని విడగొడితే సీఎంను చేస్తామన్నారు. దానికి స్పష్టమైన సమాధానం చెప్పా. కేజ్రీవాల్ నా రాజకీయ గురువు. ఆయన వద్దే రాజకీయ పాఠాలు నేర్చుకున్నా. సీఎం, పీఎం అయ్యేందుకు నేను రాజకీయాల్లోకి రాలేదు. నేను మహారాణా ప్రతాప్, రాజ్‌పుత్ వారసుడిని. తల నరక్కుంటాను. కానీ మీలాంటి కుట్రదారులు, అవినీతిపరుల ముందు ఎన్నటికీ తల వంచను. నాపైన పెట్టిన కేసులన్నీ అబద్ధం. మీరు చేయాలనుకున్నది చేసుకోండి అని చెప్పా."
-మనీశ్ సిసోదియా, దిల్లీ ఉపముఖ్యమంత్రి
మరోవైపు.. మద్యం వ్యవహారంలో సిసోదియాపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ నివాసం వద్ద ఆందోళన చేపట్టారు భాజపా కార్యకర్తలు. బారికేడ్ల పైకి ఎక్కి నివాసంలోకి వెళ్లేందుకు ప్రయత్నించారు.