దిల్లీలో బహుళ అంతస్తుల భవనం కూలిన ఘటనలో ఇద్దరు చిన్నారులు చనిపోయారు. మల్కాగంజ్ సమీపంలోని సబ్జీ మండి ప్రాంతంలో నాలుగంతస్తుల భవనం కూలిపోయింది. శిథిలాల కింద చిక్కుకుపోయిన ఇద్దరు సోదరులను సహాయబృందాలు బయటికి తీసినప్పటికీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయినట్లు అధికారులు తెలిపారు. మరో వ్యక్తికి ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నట్లు చెప్పారు.
ఈ ప్రమాదంలో ఓ కారు ధ్వంసమైనట్లు అధికారులు పేర్కొన్నారు. ఉదయం 11.50 నిమిషాలకు ప్రమాదం గురించి తమకు సమాచారం అందినట్లు పేర్కొన్న అగ్నిమాపక శాఖ అధికారులు తక్షణమే స్పందించి 5 అగ్నిమాపక శకటాలను ఘటనాస్థలానికి పంపినట్లు తెలిపారు.
పురాతన భవనం!..
ప్రమాదానికి గురైన ఈ భవనం సుమారు 75 ఏళ్ల నాటిదని.. మల్కాగంజ్ ప్రాంతంలో మరో 20 భవనాలు సైతం ప్రమాదకరంగా ఉన్నట్లు గుర్తించినట్లు అధికారులు పేర్కొన్నారు. మరోవైపు ఈ ఘటనపై విచారణకు ఆదేశించిన ప్రభుత్వం ఏడు రోజుల్లో నివేదిక సమర్పించాలని సూచించింది. బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకోనున్నట్లు తెలిపింది.
వర్షాకాల ప్రారంభానికి ముందు నిర్వహించిన సర్వేలో మొత్తం 699 భవనాలను ప్రమాదకరంగా తేల్చారు అధికారులు. మరో 444 భవనాలకు మరమ్మతులు చేయాల్సిందిగా ఆదేశించినట్లు ఎన్డీఎంసీ(NDMC) సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. డీఎంసీ చట్టంలోని సెక్షన్-348 ప్రకారం ప్రమాదకరంగా ఉన్న భవన యజమానులకు నోటీసులు జారీ చేసినట్లు వివరించారు.
ఇదీ చూడండి :నలుగురు కలిసి మహిళను వివస్త్రను చేసి, ఫోన్లో వీడియో తీసి...