Delhi Bill Passed In Parliament : విపక్షాల అభ్యంతరాల మధ్యే 'దిల్లీ' బిల్లుకు పార్లమెంట్ ఆమోద ముద్ర వేసింది. సోమవారం రాజ్యసభలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రవేశ పెట్టిన 'దిల్లీ అధికారుల నియంత్రణ బిల్లు'పై చర్చ అనంతరం.. పెద్దల సభ పచ్చజెండా ఊపింది. దిల్లీ సర్వీసుల బిల్లుకు అనుకూలంగా 131 ఓట్లు రాగా.. వ్యతిరేకంగా 102 ఓట్లు వచ్చాయి. సాంకేతిక సమస్య నేపథ్యంలో.. ఓటింగ్‌ను స్లిప్పుల ద్వారా నిర్వహించారు. రాష్ట్రపతి ఆమోదం లభిస్తే ఈ బిల్లు చట్టంగా మారనుంది. అంతకుముందు సభలో మాట్లాడిన షా.. ఈ బిల్లు సుప్రీం కోర్టు ఆదేశాలను ఉల్లంఘించలేదన్నారు. దిల్లీలో అవివీతి రహితమైన పాలనావ్యవస్థ తమ లక్ష్యమని పేర్కొన్నారు.
కాంగ్రెస్‌కు ఆ హక్కులేదు : అమిత్ షా
'దిల్లీలో అధికారుల బదిలీలు, పోస్టింగ్‌లపై ఎలాంటి తగాదాలు లేవు, సీఎంలకు ఇబ్బందులు లేవు. 2015లో 'ఆందోళన్' ప్రభుత్వం వచ్చిన తర్వాత.. కేంద్రం అధికారాన్ని తన చేతుల్లోకి తీసుకుంటుందని అంటున్నారు. భారత ప్రజలు అధికారం, హక్కును అందించినందున కేంద్రం అలా చేయవలసిన అవసరం లేదు. ఆక్స్‌ఫర్డ్ డిక్షనరీల నుంచి అందమైన, పొడవైన పదాలు చెప్పడం ద్వారా అసత్యం నిజం అయిపోదు. ఈ బిల్లు ఎమర్జెన్సీ విధించడానికి రాజ్యంగ సవరణ చేయలేదు. ప్రజల హక్కులపై ఈ బిల్లు ఎమర్జెన్సీ విధించదు. వారు హక్కులను హరించదు. ప్రజాస్వామ్యం గురించి మాట్లాడే హక్కు కాంగ్రెస్‌కు లేదు. ప్రజలు హక్కులను రక్షించడానికే మేము ఈ బిల్లును తీసుకొచ్చాము. ఆమ్ ఆద్మీ పార్టీని ప్రసన్నం చేసుకునేందుకే దిల్లీ సర్వీస్ బిల్లును కాంగ్రెస్ వ్యతిరేకిస్తోంది' అని విపక్షాలపై అమిత్ షా తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
బీజేపీపై కాంగ్రెస్, ఆప్ ఫైర్.. బీజేడీ, వైఎస్ఆర్సీపీకి హెచ్చరిక..
వివాదాస్పదమైన దిల్లీ బిల్లును రాజ్యసభలో కాంగ్రెస్, ఆప్ తీవ్రంగా వ్యతిరేకించాయి. బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వాన్ని 'కంట్రోల్ ఫ్రీక్ సర్కార్(నియంతృత్వ ధోరణి)' అంటూ విమర్శించాయి. ఈ సందర్భంగా కాంగ్రెస్ నేత అభిషేక్ సింఘ్వి.. మోదీ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. ఈ బిల్లును రాజ్యాంగ విరుద్ధం, ప్రజాస్వామ్య విరుద్ధమని అన్నారు. 'మనమంతా కలిసికట్టుగా ఈ బిల్లును వ్యతిరేకించాలి. ఎందుకంటే ఈ తరహా ఫెడరలిజం ఏదో ఒక రోజు మీ (ఇతర రాష్ట్రాలు) ఇంటి తలుపు కూడా తట్టొచ్చు' అని సింఘ్వి బిల్లుకు మద్దతు ఇచ్చిన వైఎస్ఆర్సీపీ, బీజేడీ పార్టీలను హెచ్చరించారు. ఈ సందర్భంగా జర్మన్ థియోలాజియన్ మార్టిన్ నీమొల్లర్ చెప్పిన విషయాన్ని ప్రస్తావించారు. 'క్లిష్టసమయంలో మనం ఎవరి తరఫున నిల్చోకుండా తప్పించుకుంటే.. మనకు అలాంటి పరిస్థితి ఎదురైనప్పుడు మన తరఫున నిల్చొని మాట్లాడటానికి ఎవరూ ఉండరు' అని అన్నారు.
'ఈ బిల్లు రాజ్యాంగ విరుద్ధం'
దిల్లీ బిల్లు రాజ్యాంగ విరుద్ధమని కాంగ్రెస్ ఎంపీ చిదంబరం అన్నారు. ఈ విషయం వారికి, న్యాయ శాఖకు తెలుసునన్నారు. ఈ బిల్లుకు బీజేపీ ఎలాగైనా మద్దతు ఇస్తుందని.. కానీ బీజేడీ, వైఎస్ఆర్సీపీ అర్ధ హృదయంతో మద్దతు ఎందుకు ఇచ్చారో తనకు అర్థం కావడం లేదన్నారు. 'ఈ బిల్లు కోసం ప్రభుత్వం ఒకసారి ప్రయత్నించింది.. విఫలమైంది. రెండోసారి ప్రయత్నించి విఫలమైంది. మూడోసారి కూడా ప్రయత్నిస్తున్నారు' అని వ్యాఖ్యానించారు.