భారతీయులు స్వదేశానికి తరలుతున్న క్రమంలో కాబుల్ విమానాశ్రయంలో తాలిబన్లు కాల్పులు జరిపినట్లు వెల్లడించారు సవితా షాహీ. భారత వాయుసేన.. అఫ్గానిస్థాన్ నుంచి సురక్షితంగా భారత్ తరలించినవారిలో ఆమె కూడా ఒకరు. భీతావహ పరిస్థితుల్లో ధైర్యసాహసాలతో వాయుసేన రెస్క్యూ ఆపరేషన్ చేసిందని తన స్వస్థలం ఉత్తరాఖండ్‌లోని దెహ్రాదూన్‌కు చేరుకున్న అనంతరం ఆమె వివరించారు. సవితా.. గత 8 ఏళ్లుగా అఫ్గాన్‌లోనే యూఎస్ ఆర్మీ, నాటో వైద్య బృందంలో పనిచేస్తున్నారు.
సవితా మాటల్లో భారత్ రెస్క్యూ ఆపరేషన్..
"అఫ్గానిస్థాన్‌లో పరిస్థితి ఇంత అనూహ్యంగా మారుతుందని ఊహించలేదు. సెప్టెంబరు 11లోపు ఏ దేశ ఆర్మీ అక్కడ ఉండరాదని హెచ్చరించినా.. ఆలోపే ఆక్రమణలకు తెగబడ్డారు తాలిబన్లు. ఆగస్టు 13,14 తేదీల్లో ఒక్కసారిగా కాబుల్‌ను వశం చేసుకున్నారు. దీంతో ప్రజలు ప్రాణభయంతో పరుగులు పెట్టడం ప్రారంభించారు.
ఆగస్టు 15న కాబుల్ విమానాశ్రయాన్ని పూర్తిగా తాలిబన్లు తమ అధీనంలోకి తీసుకున్నారు. విమానాలన్నీ రద్దయ్యాయి. ఇలాంటి పరిస్థితుల్లో.. ఆగస్టు 16న పౌర విమనాశ్రయానికి దగ్గర్లోనే ఉన్న మిలటరీ ఎయిర్పోర్ట్ నుంచి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు అమెరికా సైన్యం సన్నాహాలు చేపట్టింది.
సాయంత్రం 6గంటల సమయంలో.. అమెరికా, నాటో దళాల్లో పనిచేసేవారు విమానాశ్రయానికి చేరుకోగానే తాలిబన్లు ఒక్కసారిగా కాల్పులకు తెగబడ్డారు. దీంతో అక్కడి నుంచి ప్రజలను క్యాంపునకు తరిలించిన ఆర్మీ.. మరుసటి రోజు ఉదయం వరకు వేచిచూడాలని నిర్ణయించింది.
అప్పటికే విమనాశ్రయం బయట ప్రజలు దిక్కుతోచని పరిస్థితిలో ఉన్నారు. తమతమ దేశాలకు వెళ్లాలని శతవిధాల ప్రయత్నిస్తున్నారు. ఆ సమయంలో భారత రాయబార కార్యాలయంలోని ఓ అధికారితో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్న నా బృందంలోని సభ్యుడికి ఓ సమాచారం అందింది. భారత దౌత్యవేత్తలు, ఉద్యోగులు, వారి కుటుంబాలను రక్షించేందుకు మిలటరీ ఎయిర్‌పోర్టుకు భారత వాయుసేన విమానం రాబోతోందని దాని సారాంశం.
అప్పుడు ఊపిరి పీల్చుకున్నాం. యూఎస్ ఆర్మీ వైద్య బృందం నుంచి ఏడుగురు సహా దాదాపు 150 మంది ఆగస్టు 17న ఉదయం 7గంటలకు ఐఏఎఫ్ విమానంలో గుజరాత్ బయలుదేరాం. ఇక్కడ మాకు ఘన స్వాగతం లభించింది."