Dasara Vahana Pooja 2023 : కొత్తగా వాహనం కొన్నవారు ఆలయాల్లో పూజలు చేయించడం అందరికీ తెలుసు. కానీ.. దసరా రోజున కూడా వాహనానికి ప్రత్యేకంగా పూజలు చేయిస్తారు. అవకాశం ఉన్నవారు గుడికి వెళ్లి ప్రత్యేకంగా పూజ చేస్తారు. మిగిలిన వారు ఇంటి వద్దనే తమకు తెలిసిన రీతిలో పూజ చేస్తారు.
ఆయుధ పూజ చేసినట్టుగానే.. వాహనానికీ త్రికరణ శుద్ధితో పూజ చేస్తారు. అన్నదాతలు తమ వ్యవసాయ పనిముట్లకు పసుకు, కుంకమను బొట్టుగా పెట్టి.. దేవుడి చిత్ర పటాల ముందు ఉంచి పూజ చేస్తారు. ఎందుకంటే.. తమ జీవితానికి ఆసరగా నిలిచే "ఆయుధాలకు" ఈ విజయదశమి రోజున పూజ చేస్తే.. భవిష్యత్తులో విజయం తథ్యం అన్నది భావన. ఇదేవిధంగా.. వాహన దారులు కూడా పూజ చేస్తారు. తమ ప్రయాణం సురక్షితంగా, సుఖమయంగా సాగిపోవాలనే ఉద్దేశంతో వాహన పూజ జరిపిస్తారు.
అయితే.. ఆలయాల్లో పూజ చేసే వారికి.. పూజా విధానం తెలియాల్సిన అవసరం లేదు. అక్కడ పూజారి అంతా చూసుకుంటారు. కానీ.. ఇంటి వద్ద వాహన పూజ నిర్వహించేవారు మాత్రం పూజా విధానం తెలుసుకుంటే మంచిది. సరైన పద్ధతిలో పూజ చేస్తేనే.. ఆ ఫలితం కూడా సరిగా దక్కుతుందని పండితులు చెబుతున్నారు. అందుకే.. మీకోసం ఇక్కడ దసరా వేళ వాహన పూజా విధానాన్ని అందిస్తున్నాం. ఈ విజయదశమి రోజున చక్కగా పూజ చేసుకొని.. విజయం వైపు సాగిపోండి...
Devi Navratris 2023 What To Wear : దేవీ నవరాత్రులు.. తొమ్మిది రోజులు 9 వస్త్రాలు ధరించాలి.. అవేంటో మీకు తెలుసా..?
దసరా వాహన పూజ ఇలా చేయాలి (Dasara Vahana Pooja ) :
- చక్కగా వాహనాన్ని నీటితో శుభ్రం చేయండి.
- వాహనాన్ని కడగడం పూర్తయిన తర్వాత.. కలశంలో స్వచ్ఛమైన నీళ్లు తీసుకోండి. ఆ నీటిలో మామిడి ఆకు ముంచి.. వాహనంపై మూడుసార్లు చిలకరించండి.
- ఆ తర్వాత మీ వాహనం ముందు భాగంలో గంధంతో స్వస్తిక్ గుర్తు వేయండి.
- ఇప్పుడు మీ వాహనానికి పూలమాల వేయండి.
- ఆ తర్వాత వాహనాని ముందు భాగంలో కలవా కట్టండి. కలవా అంటే.. ఆలయాల వద్ద కొనుగోలు చేసి.. చేతికి కట్టుకునే ఎరుపు దారం. దీన్ని మూడు రౌండ్లు చుట్టండి. ఇది వాహనానికి రక్షణ కవచంగా ఉంటుందని భావిస్తారు.
- ఇప్పుడు వాహనానికి హారతి ఇవ్వాలి. కర్పూరం వెలిగించి, వాహనం ముందు మూడుసార్లు తిప్పండి.
- అనంతరం.. కలశంలోని నీటిని వాహనం ముందు కుడి వైపు నుంచి ఎడమ వైపునకు పోయాలి. ఇలా చేయడం.. వాహనానికి స్వాగతం చెప్పడం అన్నమాట.
- ఆ తర్వాత.. కర్పూరం బూడిదతో మీ వాహనానికి తిలకం దిద్దాలి. ఇలా చేయడం ద్వారా.. వాహనానికి దిష్టి తగలకుండా ఉంటుందట.
- ఇప్పుడు వాహనంపై స్వీటు పెట్టండి.. కాసేపు తర్వాత ఆ తీపి పదార్థాలను గోమాతకు తినిపించండి.
- అనంతరం.. వాహనం ముందు కొబ్బరికాయ కొట్టాలి. ఏడుసార్లు చుట్టూ తిప్పి కొబ్బరికాయ కొట్టాలి.
- ఆ తర్వాత వాహనానికి ముందు భాగంలో గవ్వలు వేలాడదీయండి.
- అవకాశం ఉంటే.. హనుమాన్ రక్షాకవచాన్ని వాహనానికి కట్టండి. ఆకాశంలో గదతో ఎగురుతున్న వాయునందనుడి బొమ్మ బాగుంటుంది.
- ఇక, అన్ని విఘ్నాలకూ అధిపతి అయిన.. వినాయకుడి చిత్రాన్ని వాహనానికి ముందూ వెనకా అంటించండి.
- చివరగా.. చక్రాల కింద నిమ్మకాయలు పెట్టి వాహనాన్ని ముందుకు సాగనివ్వండి.
- ఇలా పూజా విధానం చక్కగా చేయడం ద్వారా.. అంతా మంచే జరుగుతుందని పండితులు చెబుతున్నారు.
Dussehra 2023 Oct 23rd or 24th : దసరా 23నా.. 24వ తేదీనా..? పండితులు ఏం చెబుతున్నారంటే..?
Dasara Navaratri 2023 Wishes : దసరా సందడి.. దూరంగా ఉన్న మనవాళ్లకు.. శుభాకాంక్షలు ఇలా చెప్పండి!