తూర్పు మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన యాస్ తుపాను తీరంవైపు ముంచుకొస్తోంది. మరో 24 గంటల్లో అతి తీవ్ర తుపానుగా మారనుందని భారత వాతావరణ శాఖ తెలిపింది. ప్రస్తుతం పోర్ట్ బ్లెయిర్కి 600 కిలోమీటర్ల దూరంలో కదులుతున్నట్లు తెలిపింది. మే 26న మధ్యాహ్నం ఉత్తర ఒడిశా-బంగాల్ తీరంలోని పరదీప్, సాగర్ ద్వీపాల మధ్య తుపాను తీరం దాటనుంది. ఈ సమయంలో గంటకు 155-180 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని ఐఎండీ తెలిపింది.
అతి తీవ్ర తుపానుగా మారునుందన్న ఐఎండీ హెచ్చరికలతో అందుకు తగిన విధంగా సన్నద్ధమవుతున్నాయి ప్రభావిత రాష్ట్రాలు.
ఒడిశాలో..
బంగాల్ సరిహద్దు ప్రాంతమైన బాలాసోర్ జిల్లాలో తుపాను తీరం తాకనుందన్న అంచనాలతో ఏర్పాట్లు చేపట్టింది ఒడిశా ప్రభుత్వం. భారీగా సహాయక బృందాలను తరలిస్తోంది. లోతట్టు ప్రాంతాలు, తుపాను ప్రభావిత ప్రాంతాల నుంచి ప్రజలను భారీగా సురక్షితం ప్రాంతాలకు తరలిస్తున్నట్లు తెలిపారు ఎస్ఆర్సీ పీకే జేనా. తుపాను కారణంగా ఒక్కరు కూడా మరణించకూడదనే లక్ష్యంతో ప్రభుత్వం పని చేస్తున్నట్లు వివరించారు.
రాష్ట్రంలో బాలాసోర్, భద్రక్, కేంద్రపారా, జగస్టింఘ్పుర్ జిల్లాలపై అధిక ప్రభావం ఉంటుందని, మాయార్భంజ్, కియోంఝర్ జిల్లాలపై పాక్షికంగా ఉండనుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే 22 ఎన్డీఆర్ఎఫ్, 50 ఓడీఆర్ఏఎఫ్ (800 మంది సిబ్బంది) బృందాలు, 150 మంది అగ్నిమాపక సిబ్బంది, చెట్లు తొలగించేందుకు 35 బృందాలను మోహిరించారు. మరో 30 ఎన్డీఆర్ఎఫ్ బృందాలు పంపాలను కోరారు. బాలాసోర్ జిల్లాలో 140 తుపాను శిబిరాలతో పాటు 1102 ఇతర తాత్కాలిక కేంద్రాలను ఏర్పాటు చేశారు.