CWC meet on election result: ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలపై ఆత్మపరిశీలన కోసం కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ భేటీ అయింది. దిల్లీలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో సుమారు నాలుగు గంటల పాటు చర్చలు జరిపింది. అధినేత్రి సోనియా గాంధీ, మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా, కేసీ వేణుగోపాల్, రాజ్యసభలో విపక్ష నేత మల్లికార్జున ఖర్గే, పీ చిదంబరం తదితరులు భేటీలో పాల్గొన్నారు.
గాంధీ కుటుంబం పార్టీకి దూరంగా ఉండాలని నేతలు భావిస్తే తనతో పాటు రాహుల్, ప్రియాంక రాజీనామా చేసేందుకు సిద్ధమని సోనియా పేర్కొన్నట్లు పేర్కొన్నాయి. అయితే, సీడబ్ల్యూసీ ముక్తకంఠంతో దీన్ని వ్యతిరేకించిందని స్పష్టం చేశాయి. నేతలందరి అభిప్రాయాలను సోనియా గాంధీ విన్నారని పార్టీ వర్గాలు వివరించాయి. 'అసెంబ్లీ ఎన్నికల్లో ఎక్కడ తప్పు జరిగిందనే విషయంపై నేతలు చర్చించారు. పార్టీ బలోపేతానికి అవసరమైన మార్పులు చేసేందుకు సిద్ధంగా ఉన్నానని సోనియా స్పష్టం చేశారు. గులాం నబీ ఆజాద్, దిగ్విజయ్ సింగ్ వంటి నేతల అభిప్రాయాలను విన్నారు. రాజస్థాన్లో చింతన్ శివిర్ నిర్వహించాలని ఆ రాష్ట్ర సీఎం అశోక్ గహ్లోత్ సూచించారు' అని పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. 2024 సార్వత్రిక ఎన్నికలు సహా అన్ని ఎలక్షన్లను ఎదుర్కొనేందుకు కాంగ్రెస్ సిద్ధంగా ఉంటుందని పార్టీ స్పష్టం చేసింది.
కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీపై సీడబ్ల్యూసీ పూర్తి విశ్వాసం ఉంచిందని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ పేర్కొన్నారు. బడ్జెట్ సమావేశాలు పూర్తవగానే చింతన్ శివిర్ నిర్వహిస్తామని చెప్పారు. మరోసారి ఏఐసీసీ భేటీ నిర్వహించనున్నట్లు వెల్లడించారు. పార్టీని బలోపేతం చేసేందుకు సోనియా తక్షణమే చర్యలు తీసుకుంటారని చెప్పారు.
సోనియా మార్గనిర్దేశనంలో.. రాహుల్ అధ్యక్షుడిగా..!
సంస్థాగత ఎన్నికలు నిర్వహించేంత వరకు.. సీడబ్ల్యూసీలో ప్రతి సభ్యుడు సోనియా మార్గదర్శకత్వాన్ని కోరుకుంటున్నారని మరో సీనియర్ నేత సుర్జేవాలా పేర్కొన్నారు. పార్టీని రాహుల్ గాంధీ నడిపించాలని ప్రతి కాంగ్రెస్ కార్యకర్త కోరుకుంటున్నాడని చెప్పారు. సంస్థాగత ఎన్నికల కసరత్తు కొనసాగుతోందని వెల్లడించారు. ఎన్నికల తర్వాత తర్వాతి అధ్యక్షుడు ఎవరో తేలిపోతుందని అన్నారు.
CWC meet today news
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, మరో ముగ్గురు సీనియర్ నేతలు భేటీకి రాలేకపోయారని సంబంధిత వర్గాలు తెలిపాయి. కరోనా సోకడం వల్ల ఏకే ఆంటోనీ గైర్హాజరైనట్లు చెప్పారు.
రాహుల్కు అధ్యక్ష బాధ్యతలు...
కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ భేటీ నేపథ్యంలో.. రాహుల్ గాంధీకి మరోసారి అధ్యక్ష బాధ్యతలు అప్పగించాలన్న డిమాండ్ వినిపిస్తోంది. రాహుల్ గాంధీలా మరే ఇతర నేత ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ఎదుర్కోవడం లేదని రాజస్థాన్ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత అశోక్ గహ్లోత్ వ్యాఖ్యానించారు. రాహుల్ గాంధీని లక్ష్యంగా చేసుకొనే మోదీ ప్రసంగాలు ప్రారంభిస్తున్నారని, దీన్ని బట్టి రాహుల్ ప్రాముఖ్యాన్ని అర్థం చేసుకోవాలని అన్నారు.