మాజీ క్రికెటర్ సురేశ్ రైనా కుటుంబీకుల హత్య కేసులో నిందితుడిని పోలీసులు ఎన్కౌంటర్ చేశారు. ఈ ఘటన ఉత్తర్‌ప్రదేశ్.. ముజఫర్‌నగర్‌లోని షాపుర్‌లో శనివారం జరిగింది. నిందితుడు రషీద్‌ను సోరం-గోయ్లా రహదారిపై ఎన్కౌంటర్ చేసినట్లు పోలీసులు తెలిపారు. అంతకుముందు నిందితుడిపై రూ.50 వేల రివార్డు కూడా ఉందని వెల్లడించారు.
2020 ఆగస్టు 19న పఠాన్‌కోట్‌లోని క్రికెటర్ సురేశ్ రైనా అత్త, మామ ఇంట్లో రషీద్ చోరీకి పాల్పడ్డాడు. నిందితులను అడ్డుకునేందుకు ప్రయత్నించిన సురేశ్ రైనా మామ అశోక్ కుమార్, అత్త ఆశా, బావమరిది కౌశల్ కుమార్‌లను రషీద్ తీవ్రంగా గాయపరిచాడు. అశోక్ అక్కడికక్కడే మృతి చెందగా.. ఆశా, కౌశల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. ఈ కేసులో ఇద్దరు నిందితులను గతేడాది సెప్టెంబరులో పోలీసులు పట్టుకున్నారు. నిందితుల్లో ఒకరు సహరన్‌పుర్‌కు చెందిన షాజన్ కాగా.. మరొకరు మొరాదాబాద్‌కు చెందిన అసిమ్. అయితే వీరిని పోలీసులు ప్రశ్నించగా.. రషీద్ పేరు బయటకొచ్చింది. అప్పటికే రషీద్ పరారీలో ఉన్నాడు.
"శనివారం కొందరు నేరస్థులు షాపుర్‌కు వచ్చినట్లు ఇన్ఫార్మర్ నుంచి మాకు సమాచారం అందింది. దీంతో పోలీసులు, ఎస్‌ఓజీ బృందం అప్రమత్తమైంది. దుండగులు పోలీసులపై కాల్పులు జరిపారు. వారిని కాల్పులు ఆపాలని కోరాం. అయినా వినలేదు. ఎస్‌హెచ్‌ఓ బీఎస్ వర్మపై కాల్పులు జరిపారు. పోలీసులు ఆత్మరక్షణ కోసం కాల్పులు జరపగా నిందితుడు రషీద్ తీవ్రంగా గాయపడ్డాడు. అతడిని హుటాహుటిన షాపుర్‌లోని సీహెచ్‌సీ తరలించాం. అప్పటికే నిందితుడు రషీద్ మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు."
--పోలీసులు
టీమ్ ఇండియా క్రికెటర్ సురేశ్ రైనా 2020 ఆగస్టు 15న అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పాడు. 2005లో వన్డే క్రికెట్ అరంగేట్రం చేసిన రైనా మొత్తం 266 వన్డేల్లో 5,615 పరుగులు చేశాడు. అత్యధికంగా 116 పరుగులు చేసిన ఈ లెఫ్ట్ హ్యాండర్ బ్యాట్స్‌మన్ మొత్తం ఐదు సెంచరీలు, 36 అర్ధశతకాలు నమోదు చేశాడు. వన్డేల్లో 36 వికెట్లు కూడా తీశాడు.
2010లో టెస్టు క్రికెట్‌లోకి అడుగు పెట్టిన రైనా 18 టెస్టుల్లో 768 పరుగులు చేశాడు. ఇందులో ఒక శతకం కూడా ఉంది. 193 ఐపీఎల్ మ్యాచుల్లో 5,368 పరుగులు చేశాడు. ఒక సెంచరీ, 38 అర్ధ శతకాలు ఉన్నాయి. ఐపీఎల్లో చెన్నై తరఫున రాణించాడు.