దేశంలో 18 ఏళ్లు పైబడిన వారికి కొవిడ్ టీకాలు అందించే ప్రక్రియలో(Vaccination) భాగంగా రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు తామే ఉచితంగా టీకాలు పంపిణీ చేస్తామని ప్రకటించిన కేంద్రం.. జాతీయ వ్యాక్సినేషన్ విధానంపై నూతన మార్గదర్శకాలు జారీచేసింది. ఉచిత టీకా డోసులను జనాభా, వ్యాధి తీవ్రత, కేసుల సంఖ్య, వ్యాక్సినేషన్ సాగుతున్న తీరు ప్రాతిపదికన రాష్ట్రాలకు కేటాయించనున్నట్లు స్పష్టంచేసింది. కేసులు ఎక్కువగా ఉన్న రాష్ట్రాలు, వ్యాక్సినేషన్ సమర్థంగా చేపడుతున్న రాష్ట్రాలకు కేటాయింపుల్లో అధిక ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు తెలిపింది. టీకాల వృథా ఎక్కువగా ఉన్న రాష్ట్రాలకు కేటాయింపుల్లో ప్రతికూల ప్రభావం పడే అవకాశముందని హెచ్చరించింది. టీకా లభ్యత సమాచారాన్ని ఎప్పటికప్పుడు కేంద్రానికి వెల్లడించాలని సూచించింది.
75% కేంద్రానికే..
దేశంలో ఉత్పత్తి అయ్యే వ్యాక్సిన్లలో 75 శాతం కేంద్ర ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని.. టీకాలను రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు ఉచితంగా పంపిణీ చేస్తామని(free Vaccination) కేంద్రం మార్గదర్శకాల్లో పేర్కొంది. వీటిని ఆయా రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు ప్రాధాన్యత క్రమం ఆధారంగా ప్రభుత్వ వ్యాక్సిన్ కేంద్రాల ద్వారా ప్రజలకు అందించాలని సూచించింది. 18 ఏళ్లు పైబడిన వారిలో ప్రాధాన్యత క్రమాన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలే సొంతంగా నిర్ణయించుకుని టీకా పంపిణీ షెడ్యూల్ చేపట్టాలని కేంద్రం పేర్కొంది. టీకా డోసుల గురించి రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు ముందస్తు సమాచారం ఇస్తామని మార్గదర్శకాల్లో పేర్కొన్న కేంద్ర ప్రభుత్వం.. ఇదే విధంగా రాష్ట్రాలు కూడా ఆయా జిల్లాలు, వ్యాక్సిన్ కేంద్రాలకు ముందుగానే డోసుల వివరాలు పంపాలని సూచించింది. టీకా కోసం కొవిన్ ప్లాట్‌ఫామ్‌లో నమోదుతో పాటు వ్యాక్సిన్ కేంద్రాల వద్ద ఆన్‌సైట్ రిజిస్ట్రేషన్ సదుపాయాన్ని కూడా అందుబాటులో ఉంచాలని సూచించింది. రాష్ట్రాలు కాల్ సెంటర్లు, కామన్ సర్వీసు సెంటర్ల ద్వారా టీకా కోసం ముందస్తు బుకింగ్ చేసుకునే సదుపాయాన్ని ప్రజలకు కల్పించాలని పేర్కొంది.
రూ. 150 గరిష్ఠం..