ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ మహమ్మారి విజృంభిస్తున్న వేళ.. ఇదివరకే కొవిడ్ సోకిన వారికి మళ్లీ పాజిటివ్(రీ-ఇన్‌ఫెక్షన్) వస్తోందని పలు నివేదికలు వెల్లడిస్తున్నాయి. ఈ నేపథ్యంలో రీ-ఇన్‌ఫెక్షన్‌కు సాంకేతికపరంగా స్పష్టమైన నిర్వచనాన్ని భారత శాస్త్రవేత్తలు రూపొందించారు. కరోనా పాజిటివ్ వచ్చిన వ్యక్తికి కనీసం 102 రోజుల్లోపు మళ్లీ పాజిటివ్ రావడం సహా మధ్యలో ఒకసారి నెగెటివ్ వస్తేనే దాన్ని రీ-ఇన్‌ఫెక్షన్‌గా పరిగణించాలని స్పష్టం చేశారు.
కేంబ్రిజ్డ్ జర్నల్‌లో అధ్యయనం
భారత్‌తో పాటు ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ ఉద్ధృతి పెరుగుతున్న నేపథ్యంలో రీ-ఇన్‌ఫెక్షన్ కేసులు బయటపడుతుండడం శాస్త్రవేత్తల్లో ఆందోళనకు కారణమవుతోంది. ఇటు భారత్‌లోనూ కొవిడ్-19 రీ-ఇన్‌ఫెక్షన్ కేసులు వెలుగు చూస్తున్నాయి. కరోనా వైరస్ రీ-ఇన్‌ఫెక్షన్‌కు ఇప్పటి వరకు స్పష్టమైన నిర్వచనం లేకపోవడం వల్ల భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) వీటిపై అధ్యయనం చేపట్టింది. 102 రోజుల వ్యవధిలో రెండోసారి పాజిటివ్ రావడం సహా మధ్యలో ఓసారి నెగెటివ్ వస్తేనే దాన్ని రీ-ఇన్‌ఫెక్షన్‌గా పరిగణించాలని పేర్కొంది. అంతేకాకుండా కరోనా రీ-ఇన్‌ఫెక్షన్‌ను నిర్ధరించాలంటే జన్యుక్రమాన్ని అధ్యయనం చేయడం అవసరమని ఐసీఎంఆర్ స్పష్టం చేసింది. ఈ అధ్యయనానికి సంబంధించిన నివేదిక కేంబ్రిడ్జ్‌కు చెందిన ఎపిడమాలజీ అండ్ ఇన్‌ఫెక్షన్ జర్నల్‌లో ప్రచురితమైంది.
ఇదీ చదవండి:కరోనా కల్లోలం- భారత్‌లో ఒక్కరోజే 72 వేల కేసులు
ఐసీఎంఆర్ శాస్త్రవేత్తలు చేపట్టిన రీ-ఇన్‌ఫెక్షన్ అధ్యయనంలో భాగంగా 58మంది కొవిడ్ రోగులపై పరిశోధన చేపట్టారు. వీరిలో 12మంది ఆరోగ్య కార్యకర్తలున్నారు. అధ్యయనంలో పాల్గొన్న వారికి తొలుత పాజిటివ్ వచ్చిన సమయంలో వైరల్ లోడ్ తీవ్రంగా ఉండి, లక్షణాలు కనిపించని వారే అధిక సంఖ్యలో ఉన్నారు. రెండోసారి వైరస్ సోకినపుడు మాత్రం కొందరిలో మాత్రమే వైరస్ లక్షణాలు కనిపించినట్లు పరిశోధకులు గుర్తించారు.