కరోనా నియంత్రణ మార్గదర్శకాల అమల్లో లోపాల కారణంగా దేశంలో కొవిడ్ దావాగ్నిలా వ్యాపిస్తోందని సర్వోన్నత న్యాయస్థానం ఆందోళన వ్యక్తం చేసింది. కరోనా మార్గదర్శకాలపై దాఖలైన పలు పిటిషన్ల విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. కొవిడ్ 19పై ప్రపంచ యుద్ధం జరుగుతోందని, ఈ మహ్మమారి కారణంగా ప్రపంచంలో ప్రతి ఒక్కరూ బాధపడుతున్నారని ఆవేదన వ్యక్తంచేసింది.
కరోనా మార్గదర్శకాలపై దాఖలైన పిటిషన్లపై జస్టిస్ అశోక్ భూషణ్ నేతృత్వంలోని ధర్మాసనం నేడు విచారణ జరిపింది. కేంద్రం తీసుకొచ్చిన మార్గదర్శకాలు, స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్లు సరిగ్గా అమలవడం లేదని, అందువల్ల దేశంలో కరోనా దావాగ్నిలా వ్యాపిస్తోందని పేర్కొంది. ఈ సందర్భంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు న్యాయస్థానం పలు సూచనలు చేసింది. కరోనా పరిస్థితుల దృష్ట్యా ఆయా ప్రాంతాల్లో లాక్‌డౌన్ లేదా కర్ఫ్యూ విధించాలనుకుంటే ఆ నిర్ణయంపై చాలా రోజులు ముందుగానే ప్రకటన చేయాలని సూచించింది. దాంతో ప్రజలు అందుకు అనుగుణంగా సిద్ధమవుతారని తెలిపింది. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో ప్రతి రాష్ట్రం అప్రమత్తంగా వ్యవహరించాలని, కేంద్రంతో కలిసి పనిచేయాలని సూచించింది. ప్రజల ఆరోగ్యం, రక్షణకే ప్రథమ ప్రాధాన్యమివ్వాలని తెలిపింది.