ఉత్తర్‌ప్రదేశ్‌లోని లఖింపుర్ ఖేరిలో ఆదివారం చోటుచేసుకున్న హింసాత్మక ఘటనల ప్రకంపనలు కొనసాగుతూనే ఉన్నాయి. జిల్లా వ్యాప్తంగా మంగళవారమూ 144వ సెక్షన్ అమలైంది. ఇంటర్నెట్ సేవలపై ఆంక్షలు కొనసాగాయి. ఘటన చోటుచేసుకున్న తికోనియాలో పోలీసులు భారీ సంఖ్యలో మోహరించారు. అక్కడికి చేరుకునే అన్ని మార్గాల్లో గట్టి బందోబస్తు ఏర్పాటుచేశారు. మృతిచెందిన రైతుల పోస్టుమార్టం నివేదిక తీవ్ర వివాదాస్పదమైంది.
రైతు సంఘం నేత రాకేశ్ టికాయిత్ అధికారులతో చర్చలు జరపడంతో ముగ్గురి అంత్యక్రియలు పూర్తయ్యాయి. రాజకీయంగానూ పలు పరిణామాలు చోటుచేసుకున్నాయి. కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ నిర్బంధం కొనసాగింది. శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తున్నారన్న ఆరోపణలపై... ఆమెతో పాటు మరో 10 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. హింసాత్మక ఘటనపై సుప్రీంకోర్టు పర్యవేక్షణలో సీబీఐతో విచారణ జరిపించాలంటూ ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన ఇద్దరు న్యాయవాదులు భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి.రమణకు లేఖ రాశారు.
తన కుమారుడు దర్యాప్తు సంస్థల ముందు హాజరుకావడానికి సిద్ధమని కేంద్ర సహాయ మంత్రి అజయ్ మిశ్ర వెల్లడించారు. ఘటనపై పలు పార్టీల నేతలు మండిపడ్డారు. ప్రియాంకను వెంటనే విడుదల చేయాలని, మంత్రి కుమారుడిని అరెస్టు చేయాలని పలువురు నేతలు డిమాండ్ చేశారు.
నూతన వ్యవసాయ చట్టాల రద్దు కోరుతూ... లఖింపుర్ ఖేరి జిల్లాలోని తికోనియా-బన్బీర్‌పుర్ రహదారిపై ఆందోళన చేస్తున్న రైతులపైకి అజయ్ మిశ్ర కుమారుడు ఆశిష్ మిశ్ర కారు, మరో వాహనం దూసుకెళ్లడం తెలిసిందే. ఈ ఘటనలో నలుగురు రైతులు మరణించగా, అనంతరం జరిగిన అన్నదాతల దాడిలో మరో నలుగురు చనిపోవడం... దేశ వ్యాప్తంగా తీవ్ర సంచలనం రేపింది. ప్రియాంకా గాంధీ ఇంకా సీతాపుర్లోని పీఏసీ అతిథి గృహంలోనే ఉన్నారు. అక్కడ డ్రోన్లతో నిఘా పెట్టారంటూ పార్టీ జాతీయ కార్యదర్శి ధీరజ్ గుర్జార్ ఓ వీడియోను ట్విటర్లో పోస్టు చేశారు.
ప్రమాదంలో రాజ్యాంగం: రాహుల్
రైతులపైకి వాహనం దూసుకెళ్లిన వీడియోను రాహుల్ ఫేస్బుక్లో పోస్టుచేశారు.
"ఈ వీడియోను చూసిన తర్వాతైనా నిందితుడిని కస్టడీలోకి తీసుకోకుంటే, మన రాజ్యాంగం ప్రమాదంలో పడినట్టే. ఎఫ్ఐఆర్ లేకుండానే మహిళా నేతను 30 గంటలు నిర్బంధిస్తే, రాజ్యాంగం ప్రమాదంలో పడినట్టే. ఈ వీడియో ఎవర్నీ చలింపజేయకపోతే, మానవత్వమూ ప్రమాదంలో పడినట్టే"
-- రాహుల్ గాంధీ, కాంగ్రెస్ నేత
ప్రియాంక నిజమైన కాంగ్రెస్‌వాది అని, ఓటమిని అంగీకరించని ధీరవనిత అని, సత్యాగ్రహాన్ని ఆపరని పేర్కొన్నారు. భాజపా ఎంపీ వరుణ్‌గాంధీ కూడా రైతులపైకి వాహనం దూసుకెళ్లిన వీడియోను ట్వీట్ చేశారు. పోలీసులు వెంటనే ఆ వాహన యజమానిని, అందులో ఉన్నవారిని అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. లఖ్‌నవూ విమానాశ్రయానికి చేరుకున్న ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి భూపేశ్ బఘేల్‌ను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఆయన అక్కడే ధర్నా చేశారు.
మళ్లీ పోస్టుమార్టం చేయాలి..
గాయాల కారణంగానే నలుగురు రైతులు మృతిచెందినట్టు పోస్టుమార్టం నివేదిక పేర్కొనడంపై బాధిత కుటుంబ సభ్యులు అభ్యంతరం తెలిపారు. తూటాల కారణంగానే గాయపడి మరణించారని, మరోసారి పోస్టుమార్టం నిర్వహించాలని పట్టుబట్టారు. రైతు సంఘం నేత టికాయిత్ అధికారులతో చర్చలు జరిపారు. లవ్‌ప్రీత్‌సింగ్(19), నచత్తర్ సింగ్(65), దల్జీత్‌సింగ్(42)ల మృతదేహాలకు అంత్యక్రియలు నిర్వహించేందుకు వారి కుటుంబ సభ్యులు అంగీకరించారు. గుర్విందర్ సింగ్(22) మృతదేహానికి మరోసారి పోస్టుమార్టం నిర్వహిస్తామని అధికారులు హామీ ఇచ్చారు. ముగ్గురి అంత్యక్రియలు పూర్తయ్యాయి. 8 మంది మృతుల్లో.. టీవీ జర్నలిస్ట్ రామన్ కశ్యప్ కూడా ఉన్నారు.
నా కుమారుడు విచారణకు సిద్ధం: అజయ్ మిశ్ర