Himachal Pradesh Elections 2022 : దేశంలోనే అత్యధిక వయస్కుడైన ఓటరుగా రికార్డు నమోదు చేసిన హిమాచల్ ప్రదేశ్‌కు చెందిన 106 ఏళ్ల శ్యాం సరన్ నేగి కన్నుమూశారు. నవంబర్ 2న పోస్టల్ బ్యాలెట్‌తో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. తొలుత పోలింగ్ సెంటర్‌కే వెళ్లి ఓటేస్తానన్న శ్యాం.. తర్వాత మనసు మార్చుకున్నారు.
హిమాచల్ ముఖ్యమంత్రి సంతాపం..
సరణ్ నేగి మృతి పట్ల హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి జైరాం ఠాకూర్ సంతాపం తెలిపారు. "కిన్నౌర్ ప్రాంతానికి చెందిన స్వతంత్ర భారత అత్యధిక వయస్కుడైన ఓటర్ శరణ్ నేగి మరణ వార్త బాధ కలిగించింది" అని ట్విట్టర్లో పోస్ట్ చేశారు.
First Voter Of India : దేశానికి స్వాతంత్ర్యం వచ్చాక 1951లో జరిగిన తొలి లోక్‌సభ ఎన్నికల్లో ఓటేశారు శ్యాం. ఆ సమయంలో ఆయన పాఠశాల ఉపాధ్యాయుడిగా విధులు నిర్వర్తిస్తున్నారు. ఓటు వేసి ఆ తర్వాత తన విధులకు హాజరయ్యారు. అప్పటి నుంచి లోక్‌సభ, అసెంబ్లీ, పంచాయతీ రాజ్ ఎన్నికల కలిపి మొత్తం 32 సార్లు ఓటేసి యువతరానికి ఆదర్శంగా నిలిచారు. అందుకే ఆయన భారతీయ ప్రజాస్వామ్య 'లివింగ్ లెజెండ్'గా పేరొందారు. తన చుట్టుపక్కల ఉన్న ప్రజలకు ఓటు ప్రాముఖ్యాన్ని వివరించి మరీ ఓట్లు వేయించేవారు.