Corona Cases in India: దేశంలో రోజువారీ కరోనా కేసులు సంఖ్య భారీగానే నమోదవుతోంది. కేరళలో శనివారం కొత్తగా 45,136 మందికి వైరస్ సోకింది. శుక్రవారంతో పోలిస్తే కొత్త కేసులు 3వేలకుపైగా అధికంగా నమోదయ్యాయి. రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 55,74,702కు చేరింది. మరో 132 మంది మరణించారు. అందులో 70 కేసులు సవరించిన మార్గదర్శకాల ప్రకారం వచ్చినట్లు ఆరోగ్య శాఖ తెలిపింది.
దిల్లీలో..
దేశ రాజధాని దిల్లీలో కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. శనివారం మరో 11,486 మందికి పాజిటివ్‌గా తేలింది. 45 మంది ప్రాణాలు కోల్పోయారు. జూన్ 5 తర్వాత అత్యధిక మరణాలు ఇవేనని ఆరోగ్య శాఖ తెలిపింది. మరో 14,802 మంది కోలుకున్నారు. రోజువారీ పాజిటివిటీ రేటు 16.16శాతంగా ఉంది.
మాజీ ప్రధాని దేవెగౌడకు రెండోసారి కరోనా
జేడీఎస్ అధినేత, మాజీ ప్రధాని దేవెగౌడ మరోసారి కరోనా బారినపడ్డారు. తాజాగా ఆయనకు పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. కొవిడ్ పాజిటివ్‌గా తేలినప్పటికీ లక్షణాలేమీ లేవని సమాచారం. అయితే, ఆయన్ను మణిపాల్ ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. ఆయన సతీమణి చెన్నమ్మకు నెగెటివ్ వచ్చింది. ఆమె ఇంట్లోనే ఉన్నారు. గతేడాది మార్చిలో దేవెగౌడ, ఆయన సతీమణి కొవిడ్ బారినపడ్డారు. మరోవైపు, దేవెగౌడ త్వరగా కోలుకోవాలంటూ కర్ణాటక సీఎం బసవరాజ్ బొమ్మై ఆకాంక్షించారు. మాజీ ప్రధాని త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తూ కర్ణాటక ఆరోగ్యమంత్రి డాక్టర్ కె.సుధాకర్ ట్వీట్ చేశారు. ఆయన ఆరోగ్యం గురించి వైద్యులతో ఎప్పటికప్పుడు మాట్లాడుతున్నారు.
గుజరాత్లో రాత్రి కర్ఫ్యూ..