తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'కాంగ్రెస్ ఆఫీస్​లోకి పోలీసులు.. కార్యకర్తలపై లాఠీఛార్జ్​!'.. నిజమెంత?

Rahul Gandhi: ఈడీ ఎదుట మూడో రోజు విచారణకు హాజరైన రాహుల్​ గాంధీకి మద్దతుగా కాంగ్రెస్ కార్యకర్తలు పెద్దఎత్తున నిరసనలు చేపట్టారు. ఈడీ కార్యాలయం ఎదుట నడిరోడ్డుపై టైర్లు తగలబెట్టారు. పార్టీ ప్రధాన కార్యాలయం వద్ద ఆందోళనకు దిగారు. మరోవైపు పోలీసులు కాంగ్రెస్​ కార్యాలయంలోకి ప్రవేశించి తమ కార్యకర్తలపై లాఠీ ఛార్జ్ చేశారని రణ్​దీప్​ సూర్జేవాలా ఆరోపించారు.

congress-stages-protest
కాంగ్రెస్ నిరసనలు ఉద్రిక్తం

By

Published : Jun 15, 2022, 4:13 PM IST

Congress protest: నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్​ అగ్రనేత రాహుల్ గాంధీని ఎన్​ఫోర్స్​మెంట్​ డైరెక్టరేట్​ వరుసగా మూడో రోజు విచారించడాన్ని ఆ పార్టీ నేతలు తీవ్రంగా వ్యతిరేకించారు. రాహుల్​కు మద్దతుగా కాంగ్రెస్ కార్యకర్తలు ఈడీ కార్యాలయం, పార్టీ ప్రధాన కార్యాలయం వద్ద చేపట్టిన నిరసనలు తీవ్ర ఉద్రిక్తతలకు దారితీశాయి. కాంగ్రెస్ మద్దతుదారులు ఈడీ కార్యాలయం ఎదుట నడిరోడ్డుపై టైర్లు తగలబెట్టి నిరసన తెలిపారు. పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. మరోవైపు ఏఐసీసీ కార్యాలయం ఆవరణలో ఆందోళనలు నిర్వహించారు. వీరిని అదుపు చేసేందుకు పోలీసులు ప్రయత్నించడం తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీసింది.

కాంగ్రెస్ నిరసనలు ఉద్రిక్తం

'కార్యాలయంలోకి వచ్చి గూండాయిజం': పోలీసులు కాంగ్రెస్ ప్రధాన కార్యాలయంలోకి చొచ్చుకెళ్లి తమ కార్యకర్తలపై లాఠీ ఛార్జ్ చేశారని ఆ పార్టీ నేత రణ్​దీప్ సూర్జేవాలా ఆరోపించారు. దిల్లీ పోలీసులు ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరించి గూండాయిజం చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఇది తారస్థాయికి చేరిందని, ఇలాంటివాటిని సహించబోమని హెచ్చరించారు. తాము శాంతిని కోరుకుంటామని, తమ సహనాన్ని పరీక్షించవద్దని అన్నారు. పోలీసుల తీరుకు నిరసనగా జూన్ 16న దేశవ్యాప్తంగా రాజ్​భవన్​ల ముందు నిరసనలు చేపట్టనున్నట్లు తెలిపారు. అలాగే జూన్ 17న జిల్లా కేంద్రాల్లో ఆందోళనలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు.

కాంగ్రెస్ ప్రధాన కార్యాలయం వద్ద 144 సెక్షన్ అమల్లో ఉందని, నిరసనలకు అనుమతి లేకున్నా ఆ పార్టీ కార్యకర్తలు ఆందోళనలు చేపట్టారని స్పెషల్ సీపీ ఎప్పీ హుడా తెలిపారు. కార్యకర్తలే పోలీసులపైకి బారికేడ్లు విసిరారని చెప్పారు. పోలీసులు ఎవరూ ఏఐసీసీ కార్యాలయంలోకి ప్రవేశించలేదని, లాఠీ ఛార్జ్ కూడా చేయలేదని స్పష్టం చేశారు. నిరసనలు మూడో రోజు కొనసాగాయని, మొత్తం 150మందిని అదుపులోకి తీసుకున్నట్లు వివరించారు.

'చరిత్రలో ఏనాడూ ఇలా జరగలేదు': కాంగ్రెస్ ప్రధాన కార్యాలయంలో రాజకీయ కార్యకలాపాలను ప్రభుత్వం స్తంభింపచేయడం దారుణమని ఆ పార్టీ సీనియర్ నేత, రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్ అన్నారు. కార్యకర్తలను కూడా లోనికి అనుమతించడంలేదని ఆరోపించారు. అధికార పార్టీ తీవ్ర పరిణామాలను ఎదుర్కొవాల్సి ఉంటుందని హెచ్చరించారు. దేశంలో ఎలాంటి పరిస్థితి ఉందో ప్రతిఒక్కరికి తెలుస్తోందన్నారు. పార్టీ ప్రధాన కార్యాలయంలోకి సొంత నేతలు, కార్యకర్తలు, సిబ్బందిని అనుమతించకపోవడం దేశ చరిత్రలోనే ఎప్పుడూ జరగలేదని గహ్లోత్ వ్యాఖ్యానించారు. అణచివేతకు కూడా ఓ పరిమితి ఉంటుందని, కానీ ఇప్పుడు అది అన్ని హద్దులు దాటిందని పేర్కొన్నారు. భాజపా ఎనిమిదేళ్ల పాలన దేశ చరిత్రలో ఓ చీకటి అధ్యాయంగా మిగిలిపోతుందన్నారు.

బదర్​పుర్​ పోలీస్​ స్టేషన్​లో నిర్బంధించిన కాంగ్రెస్ నేతలను కలిసేందుకు వెళ్లిన ఛత్తీస్​గఢ్ సీఎం భూపేశ్ బఘేల్ కాన్వాయ్​ను దిల్లీ పోలీసులు మంగళవారం అడ్డుకున్నారు. దీనిపై ఆయన తీవ్రంగా స్పందించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా గళమెత్తిన వారిని కేంద్రం అణచివేస్తొందని మండిపడ్డారు. ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తి చూపినందుకే రాహుల్ గాంధీపై కక్షసాధింపు చర్యలకు దిగుతున్నారని ఆరోపించారు.

'నిరసనలు కాంగ్రెస్ పతనానికి నిదర్శనం'
అవినీతిని కప్పిపుచ్చుకునేందుకు కాంగ్రెస్ హింసాత్మక నిరసనలు చేపడుతోందని భాజపా అధికార ప్రతినిధి సుధాన్షు త్రివేది ధ్వజమెత్తారు. ఇది ఆ పార్టీ రోజు రోజుకు ఎంత పతనమవుతుందో తెలియజేస్తుందన్నారు. గాంధీ కుటుంబం అవినీతిని కప్పిపుచ్చడమే ఆ పార్టీ సత్యాగ్రహం అని తీవ్ర విమర్శలు చేశారు.

'ఈడీ పేరు మారింది': మరోవైపు.. ఎన్​ఫోర్స్​మెంట్ డెరెక్టరేట్​ అర్థం ఇప్పుడు 'ఎగ్జామినేషన్​ ఇన్​ డెమొక్రసీ'గా మారిందని ఎస్పీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్ అన్నారు. రాజకీయాల్లో ప్రతిపక్షాలు ఈ పరీక్షను ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు. ప్రభుత్వం విఫలమైనప్పుడు ఈ పరీక్షను ప్రకటిస్తుందని, దీనికి సిద్ధమైన వారు భయపడరని పేర్కొన్నారు. అది ఎలాంటి పరీక్ష అయినా ధైర్యంగా ఎదుర్కొంటారని చెప్పారు.

ఇదీ చదవండి:స్వప్న ఆరోపణలతో చిక్కుల్లో అధికార పక్షం.. ఆ వీడియోతో సీఎంఓ కౌంటర్​

ABOUT THE AUTHOR

...view details