Himachal Pradesh Election 2022 : హిమాచల్‌ప్రదేశ్‌లో నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కావడం వల్ల అన్ని రాజకీయ పార్టీలు అభ్యర్థులను ఎంపిక చేసే పనిలో నిమగ్నమయ్యాయి. తాజాగా కాంగ్రెస్ పార్టీ 46 మందితో కూడిన అభ్యర్థుల జాబితాను మంగళవారం విడుదల చేసింది.
మరోవైపు, అధికార భాజపా 62 స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసింది. మంగళవారం భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా అధ్యక్షతన హాజరైన పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఈ సమావేశానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సహా పలువురు కేంద్ర మంత్రులు, సభ్యులు హాజరయ్యారు. భేటీలో అభ్యర్థుల పేర్లను ఖరారు చేసిన భాజపా.. బుధవారం 62 మంది పేర్లను ప్రకటించింది. ముఖ్యమంత్రి జైరాం ఠాకూర్.. సిరాజ్ స్థానం నుంచి పోటీ చేయనున్నారు. మండీ నుంచి అనిల్ శర్మ, ఉనా నుంచి సత్పాల్ సింగ్ పోటీ పడనున్నారు.
- ఎన్నికల నోటిఫికేషన్ విడుదల తేదీ: అక్టోబర్ 17
- నామినేషన్ల దాఖలుకు చివరి తేదీ: అక్టోబర్ 25
- నామినేషన్ల పరిశీలన: అక్టోబర్ 27
- నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ: అక్టోబర్ 29
- పోలింగ్ తేదీ: నవంబర్ 12
- ఓట్ల లెక్కింపు తేదీ: డిసెంబర్ 8
హిమాచల్‌ప్రదేశ్‌లో నవంబర్ 12న ఒకే విడతలో ఎన్నికలు జరగనున్నాయి. అలాగే, డిసెంబర్ 8న ఫలితాలు వెలువడనున్నాయి. రాష్ట్రంలోని 12 జిల్లాల్లో మొత్తం 55,07,261 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో 27,80,208 పురుషులు కాగా.. 22,27,016 మంది మహిళా ఓటర్లు. ఈ ఎన్నికల్లో తొలిసారి 1,86,681మంది యువత ఓటుహక్కు వినియోగించుకోనున్నారు. 7,881 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు.