CONGRESS ON PETROL TAX CUT:పెట్రోల్ ధరలను తగ్గిస్తూ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చేసిన ప్రకటనపై కాంగ్రెస్ విమర్శలు వ్యక్తం చేసింది. ప్రజలకు నిజమైన ఉపశమనం అవసరమని, అంకెల గారడీ కాదని పేర్కొంది. పెట్రోల్‌పై 60 రోజుల్లో రూ.10 ధర పెంచి... ఇప్పుడు రూ.9.50 తగ్గించారని మండిపడింది. దమ్ముంటే పెట్రోల్, డీజిల్‌పై విధించిన ఎక్సైజ్ సుంకాన్ని యూపీఏ ప్రభుత్వం ఉన్న 2014 మే స్థాయికి తీసుకురావాలని డిమాండ్ చేసింది.
"ఆర్థికమంత్రి గారూ... 60 రోజుల వ్యవధిలో లీటర్ పెట్రోల్ ధరను రూ.10 పెంచారు. ఇప్పుడు రూ.9.50 తగ్గించారు. డీజిల్ ధరను రూ.10 పెంచి.. ఇప్పుడు రూ.7 తగ్గించారు. ప్రజలను మోసం చేయడం ఆపండి. 2014 మేలో లీటర్ పెట్రోల్‌పై ఎక్సైజ్ డ్యూటీ రూ.9.48 మాత్రమే ఉండేది. ఇప్పుడు అది రూ.19.90గా ఉంది. డీజిల్‌పై అప్పట్లో రూ.3.56 ఎక్సైజ్ డ్యూటీ ఉంటే.. ఇప్పుడది రూ.15.80 ఉంది. దేశానికి మీ అబద్దాలు, అంకెల గారడీ అవసరం లేదు. ఎక్సైజ్ సుంకాన్ని వెనక్కి తీసుకోండి."
-రణదీప్ సుర్జేవాలా, కాంగ్రెస్ ప్రతినిధి
పెట్రోల్‌పై కేంద్రం సెస్సులు విధించి రాష్ట్రాలకు నిధులు అందకుండా చేస్తోందని ఆరోపించిన కాంగ్రెస్ సీనియర్ నేత చిదంబరం.. వాటిని తగ్గిస్తేనే నిజమైన ఉపశమనం ఉంటుందని అన్నారు. ఇప్పుడు పెట్రోల్‌పై పన్నులు తగ్గించాలని రాష్ట్రాలను కోరడం.. పూర్తిగా అర్థం లేని వాదన అని పేర్కొన్నారు. మరోవైపు, పెట్రోల్ ధరలపై ఇటీవల కాంగ్రెస్ పార్టీ చేపట్టిన అవగాహన కార్యక్రమాల ఫలితంగానే కేంద్రం ఎక్సైజ్ డ్యూటీ తగ్గించిందని రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్ పేర్కొన్నారు. కాంగ్రెస్ ఎంపీ మానిక్కం ఠాగూర్ సైతం కేంద్రంపై విమర్శలు గుప్పించారు. ధనికులను ఆదుకొని, పేదలపై భారం మోపుతున్నారని ధ్వజమెత్తారు. కేంద్ర మంత్రి ప్రకటన అహంకార పూరితంగా ఉందంటూ వ్యాఖ్యలు చేశారు.
Petrol Excise duty UPA:కాగా, పెట్రోల్‌పై తగ్గించిన ఎక్సైజ్ డ్యూటీ సరిపోదని, ఏడేళ్ల క్రితం ఏ స్థాయిలో ఉందో అక్కడికి తీసుకురావాలని మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే డిమాండ్ చేశారు. 'రెండు నెలల క్రితమే పెట్రోల్‌పై ఎక్సైజ్ డ్యూటీని లీటర్‌కు రూ.18.42 పెంచారు. ఇప్పుడు రూ.8 తగ్గించారు. డీజిల్‌పై ఎక్సైజ్ డ్యూటీని రూ.18.24 పెంచి.. ఇప్పుడు రూ.6 తగ్గించారు. ఒక్కసారిగా భారీగా పెంచి.. మోస్తరుగా తగ్గించడం సమంజసం కాదు' అని అన్నారు ఠాక్రే.