కాంగ్రెస్‌లోని అన్ని స్థాయిల్లో విస్తృత సంస్కరణలు ప్రవేశపెట్టాలని ఆ పార్టీ సీనియర్ నేత కపిల్ సిబల్ పేర్కొన్నారు. పార్టీ స్తబ్దుగా లేదన్న విషయాన్ని నిరూపించుకునేందుకు ఇవి అత్యావశ్యకమని అన్నారు. దేశవ్యాప్తంగా భాజపాకు ప్రత్యామ్నాయంగా నిలబడేందుకు సంస్కరణలే కీలకమని స్పష్టం చేశారు. కొవిడ్ కారణంగా వాయిదా పడిన పార్టీ అంతర్గత ఎన్నికలు త్వరలోనే జరుగుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ మేరకు పీటీఐ వార్తా సంస్థకు ఇంటర్వ్యూ ఇచ్చారు.
"ప్రస్తుతం భాజపాకు రాజకీయ ప్రత్యామ్నాయం లేకుండా పోయింది. కానీ ప్రధాని మోదీ దేశాన్ని పాలించే నైతిక అర్హత కోల్పోయారు. భాజపాయేతర పార్టీలు ఇటీవలి ఎన్నికల్లో గెలవడాన్ని బట్టి చూస్తే కాషాయదళం పరిస్థితి అర్థమవుతుంది. కఠిన ప్రత్యర్థి ఎదురైతే భాజపా ఓడిపోతుంది. ప్రస్తుత పరిస్థితుల్లో కాంగ్రెస్ భాజపాకు ప్రత్యామ్నాయంగా అవతరించవచ్చు. ఎన్నికల్లో ఓటమిపై సమీక్షలు నిర్వహించడం సరైనదే. కానీ సమావేశాల్లో ఇచ్చిన సిఫార్సులను అమలు చేయకపోతే ఎలాంటి ఫలితం ఉండదు. పార్టీకి పునరుజ్జీవం లభించాలి. అలా జరగాలంటే.. పార్టీ క్రియాశీలంగా ఉందని ప్రజలకు తెలియాలి. ఇందుకోసం సంస్థాగతంగా సంస్కరణలు తీసుకురావాలి."
-కపిల్ సిబల్, కాంగ్రెస్ సీనియర్ నేత