Congress Foundation Day : భాజపా ప్రభుత్వంపై మరోసారి నిప్పులు చెరిగారు కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే. దేశ ప్రజలు ద్రవ్యోల్బణం, నిరుద్యోగ సమస్యలతో బాధపడుతుంటే.. ప్రభుత్వం వాటిని పట్టించుకోకుండా విద్వేషాలు రాజేసి, విడగొడుతోందని విమర్శించారు. కాంగ్రెస్ 138వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా దిల్లీలోని ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ సహా సీనియర్ నేతల సమక్షంలో పార్టీ జెండాను ఆవిష్కరించారు.
భారత్ అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం మాత్రమే కాదని.. కొన్ని దశాబ్దాలలోనే ఆర్థిక, అణు, రక్షణ రంగాల్లో సూపర్ పవర్‌గా మారుతోందని అశాభావం వ్యక్తం చేశారు ఖర్గే. దళితులు, పేదల సంకెళ్లను తెంచడం కోసం కాంగ్రెస్ ఎంతో పోరాటం చేసిందని చెప్పారు. ప్రజాస్వామ్యం బలంగా ఉండేందుకు మాజీ ప్రధాని నెహ్రూ ఐదుగురు కాంగ్రెస్సేతర మంత్రులను కేబినెట్లోకి తీసుకున్నారని గుర్తు చేశారు.