Congress Chintan Shivir: కాంగ్రెస్ ప్రక్షాళన, పునరుత్థానం కోసం మేధోమథనం జరగాలని పార్టీ శ్రేణుల నుంచి చాన్నాళ్లుగా వస్తున్న డిమాండ్‌ను పార్టీ అధిష్ఠానం ఎట్టకేలకు మన్నించింది. వచ్చే నెల 13, 14, 15 తేదీల్లో రాజస్థాన్‌లోని ఉదయ్‌పుర్ వేదికగా ‘నవసంకల్ప్ చింతన్ శివిర్’ నిర్వహించాలని నిర్ణయించింది. దేశంలోని అన్ని రాష్ట్రాల నుంచి దాదాపు 400 మంది ప్రతినిధులు ఇందులో పాల్గొంటారని పార్టీ సోమవారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది. ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ మార్గనిర్దేశం మేరకు 2024 సార్వత్రిక ఎన్నికలకు పార్టీని సమాయత్తం చేయడానికి కాంగ్రెస్ అధిష్ఠానం సిద్ధమవుతున్న నేపథ్యంలో ఈ శివిర్ నిర్వహణ ప్రాధాన్యత సంతరించుకుంది.
Congress News: దాదాపు 9 ఏళ్ల తర్వాత కాంగ్రెస్ రాజస్థాన్‌లో చింతన్ శివిర్ నిర్వహిస్తోంది. ఇందులో కాంగ్రెస్ అగ్రనేతలతోపాటు పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, పార్టీ పదాధికారులు పాల్గొననున్నారు. ‘మిషన్ 2024’ పేరుతో కాంగ్రెస్ రూపొందిస్తున్న వ్యూహాన్ని ఈ శివిర్ ద్వారా పార్టీ కార్యకర్తల్లోకి తీసుకెళ్లాలన్నది అధిష్ఠానం వ్యూహం. ఇందులో ప్రశాంత్ కిశోర్ కూడా పాల్గొంటారని అంచనాలు వెలువడుతున్నాయి. ఇటీవల యూపీ సహా ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో పార్టీకి ఎదురైన ఘోర ఓటమిపై; గుజరాత్, హిమాచల్‌ప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్, కర్ణాటక, తెలంగాణ, మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించే అవకాశాలున్నాయి. 2013లో జైపుర్‌లో జరిగిన చింతన్ శివిర్‌లో రాహుల్‌గాంధీ పార్టీ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఉదయ్‌పుర్‌లో మళ్లీ ఆయన్ను అధ్యక్షుడిగా ఎన్నుకొనే సూచనలున్నట్లు కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి.
ఉదయ్‌పుర్ ఎందుకు?:మేవాడ్ ప్రాంతంలోని ఉదయ్‌పుర్‌ని చింతన్ శివిర్ కోసం కాంగ్రెస్ అధిష్ఠానం వ్యూహాత్మకంగా ఎంపిక చేసింది. రాజస్థాన్‌లో అధికారం చేపట్టాలంటే మేవాడ్ ప్రాంతంలో సత్తా చూపడం చాలా అవసరం. ఈ ప్రాంతంలో ఎవరు అత్యధిక సీట్లు గెలుచుకుంటే రాష్ట్రంలో వారిదే అధికారం అన్నది దాదాపు ఆనవాయితీగా మారిపోయింది.