తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ప్రకృతిని విస్మరిస్తే భారీ మూల్యం తప్పదు

ప్రకృతి ప్రసాదించిన వృక్ష, అటవీ సంపదతో పాటు విలువైన ఖనిజ సంపద మన మౌలిక అవసరాలను తీరుస్తోంది. అభివృద్ధి పేరుతో వాటిని విచ్చలవిడిగా వాడేస్తూ ప్రకృతిని ధ్వంసం చేస్తున్నాం. ఈ చర్యలు వాతావరణ మార్పులకు, కాలుష్యానికి దారి తీస్తున్నాయి. ప్రకృతిని, జీవ వైవిధ్యాన్ని పరిరక్షించుకోకపోతే భవిష్యత్తులో మానవాళి భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

world nature conservation day
ప్రకృతిని విస్మరిస్తే భారీ మూల్యం తప్పదు

By

Published : Jul 28, 2021, 8:40 AM IST

సమస్త జీవరాసులకు అవసరమైన ఆహారం, నీరు, సారవంతమైన భూమి, ఇంధనం వంటి వాటిని ప్రకృతి అందిస్తోంది. వాతావరణంలోని మార్పులు, భూతాపం వల్ల జీవ వైవిధ్యం నానాటికీ దెబ్బతింటోంది. ప్రకృతి పరిరక్షణ కోసం అంతర్జాతీయ సమితి (ఐయూసీఎన్‌) లెక్కల ప్రకారం 47,677 జీవరాసుల్లో 17,291 జాతులు అంతరించిపోయే ప్రమాదంలో ఉన్నాయి. 5,409 క్షీరద జాతుల్లో ఇప్పటికే 79 అంతరించిపోగా, 188 జాతులు తీవ్ర ప్రమాదంలో ఉన్నాయి. అభివృద్ధి పేరుతో చేపడుతున్న చర్యలు వాతావరణ మార్పులకు, కాలుష్యానికి దారి తీస్తున్నాయి. భూతాపం కారణంగా ఏటా కార్చిచ్చులు, తుపాన్లు, వరదలు, క్షామాలు సాధారణం అయ్యాయి. కాలుష్యం వల్ల ప్రపంచవ్యాప్తంగా పారిశ్రామికవాడల్లో, నగరాల్లో ఉండే ప్రజల ఊపిరితిత్తుల సామర్థ్యం దెబ్బతింటోంది. ఫలితంగా వారు ఎక్కువగా కొవిడ్‌ మహమ్మారి బారిన పడుతున్నారు. ఈ తరుణంలో 2021-2030ను పర్యావరణ వ్యవస్థ పునరుద్ధరణ దశాబ్దంగా ఐక్యరాజ్య సమితి గుర్తించింది.

ప్రకృతి ప్రసాదించిన వృక్ష, అటవీ సంపదతో పాటు విలువైన ఖనిజ సంపద మన మౌలిక అవసరాలను తీరుస్తోంది. అభివృద్ధి పేరుతో వాటిని విచ్చలవిడిగా వాడేస్తూ ప్రకృతిని ధ్వంసం చేస్తున్నాం. ప్రకృతి పరిరక్షణ ఆదివాసుల సంస్కృతిలో అనాదిగా కొనసాగుతూ వస్తోంది. అడవుల్లోనే కొంత భాగాన్ని లేదా కొన్ని ప్రదేశాలను దేవుళ్ల ఆవాసాలుగా గుర్తించి అక్కడ పూజలు పునస్కారాలు చేస్తుంటారు. వీటినే పవిత్ర వనాలు (సాక్రెడ్‌ గ్రోవ్స్‌)గా పేర్కొంటారు. వీటిలో చెట్లను నరకడం, జంతువులను వేటాడటం వంటివి నిషిద్ధం.

ఈ నిబంధనల కారణంగానే పవిత్రవనాల్లో ఇప్పటికీ జీవ వైవిధ్యం అంతోయింతో మిగిలి ఉంది. ఇవి ఇండియాలోనే కాక- నేపాల్‌, బంగ్లాదేశ్‌, ఘనా, నైజీరియా, సిరియాతో పాటు అభివృద్ధి చెందిన ఆస్ట్రేలియా, అమెరికా, ఐరోపా దేశాల్లోనూ కనిపిస్తాయి. వీటిని ఇండియాలోని ఆయా రాష్ట్రాల్లో వేర్వేరు పేర్లతో పిలుస్తారు. ఉత్తరాఖండ్‌ కుమావూం ప్రాంతంలోని సాత్తాల్‌ సరస్సుల ప్రదేశాన్నీ అక్కడి ప్రజలు చాలా పవిత్రంగా పూజిస్తుంటారు. ఈ ప్రాంతం 525 రకాల సీతాకోకచిలుకలు, 500 రకాల పక్షులు, అంతరించిపోతున్న అనేక జీవరాసులకు ప్రసిద్ధి. 'నేచర్‌ టూరిజం' పేరుతో ఇక్కడ సుందరీకరణ పనులు, వాణిజ్య సముదాయాలు, పిల్లల వినోద పార్కులు వంటివి చేపట్టడం వల్ల ఆ ప్రాంతం తీవ్రంగా దెబ్బతింటోంది. దాన్ని సంరక్షించుకునేందుకు స్థానికులు 'సేవ్‌ సాత్తాల్‌' ఉద్యమం చేపట్టారు. సాంకేతికత అభివృద్ధి, ఆధునికత, జనాభా పెరుగుదల వంటి వాటి వల్ల ఈ పవిత్రవనాల పట్ల ప్రజల దృక్పథం మారుతూ వస్తోంది.

మడ అడవులకు రక్షణ లేదు..

మడ అడవులు సముద్రతీర ప్రాంతాలను సునామీలు, తుపాన్ల నుంచి కాపాడుతూ, స్థానికులకు జీవనోపాధినీ అందిస్తున్నాయి. ఇవి జీవవైవిధ్యాన్ని పెంపొందించడంలో ప్రముఖ పాత్రను పోషిస్తున్నాయి. పట్టణాల రసాయన వ్యర్థాలు, మురుగు మడ అడవులను నాశనం చేస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా సముద్ర తీర ప్రాంతాల్లో, దీవుల్లో ఉన్న మడ అడవులను ధ్వంసం చేసి రిసార్టులు నిర్మిస్తుండటం వల్ల సునామీ వంటి ప్రకృతి విపత్తులు వచ్చినప్పుడు ప్రాణ, ఆస్తి నష్టం ఎక్కువగా సంభవిస్తోంది. 1992 రియో డి జెనీరో జీవ వైవిధ్య సదస్సులో సహజ వనరుల నిర్వహణ, పరిరక్షణపై జరిగిన ఒప్పందంలో భారత్‌ సైతం సంతకం చేసింది. తదనుగుణంగా 2002లో జీవ వైవిధ్య చట్టాన్ని చేసింది. ఇప్పటి వరకు చాలా రాష్ట్రాల్లోని స్థానిక సంస్థల్లో జీవ వైవిధ్య రికార్డులనూ అభివృద్ధి చేయలేదు.

2015 ప్యారిస్‌ ఒప్పందం ప్రకారం కర్బన ఉద్గార దేశాలు ఘన వ్యర్థాల రీసైక్లింగ్‌తో పాటు అడవుల పెంపకం ద్వారా భూతాపాన్ని రెండు శాతంలోపే ఉంచేలా చూడాలని తీర్మానించారు. ఇవి సరిగ్గా అమలు కావడం లేదు. ప్రపంచ వాతావరణ సంస్థ (డబ్ల్యూఎంఓ) వెలువరించిన ప్రపంచ వాతావరణ నివేదిక 2020 ప్రకారం- భూగ్రహం మీద 90 శాతం ఉన్న వేడిని సముద్రాలు గ్రహించడం వల్ల చోటుచేసుకున్న జలచక్రం కారణంగా తుపాన్లు, కుంభవృష్టులు ఏర్పడి నగరాల్ని అతలాకుతలం చేస్తున్నాయి. ఇటీవల జర్మనీలో, బెల్జియంలో భయంకర వరదల వల్ల సుమారు వంద మంది మరణించారు. మరెందరో గల్లంతయ్యారు. ఈ పరిస్థితిలో మార్పు రావాలంటే పచ్చదనం పరిరక్షణతో పాటు శిలాజ ఇంధనాలకు బదులు పునరుత్పాదక ఇంధనాలను ఉపయోగించాలి. ప్రకృతితో సఖ్యతగా జీవించాలి. ప్రకృతి వనరులను, పర్యావరణ సమతుల్యాన్ని కాపాడాల్సిన అంతర్జాతీయ, జాతీయ హరిత ట్రైబ్యునళ్లు రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గకుండా నిక్కచ్చిగా వ్యవహరించాలి. ప్రకృతిని, జీవ వైవిధ్యాన్ని పరిరక్షించుకోకపోతే భవిష్యత్తులో మానవాళి భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు.

- డాక్టర్‌ దన్నారపు వెంకట ప్రసాద్‌ (మధ్యప్రదేశ్‌లోని ఇందిరాగాంధీ గిరిజన వర్సిటీ సహాయ ఆచార్యులు)

ఇదీ చదవండి :కరోనా వేళ భయపెడుతున్న మరో వ్యాధి

ABOUT THE AUTHOR

...view details