Communal Harmony In Cuttack :ఒడిశాలోని కటక్‌లో మత సామరస్యం వెల్లివిరిసింది. తనఖా పెట్టిన అమ్మవారి ఆభరణాలను విడిపించాడు ఓ ముస్లిం వ్యక్తి. రూ. 48,000 సొంత నగదును చెల్లించి ఆభరణాలను తీసుకువచ్చాడు. దీంతో అతడిపై ప్రశంసలు కురుస్తున్నాయి.
ఇదీ జరిగింది
కటక్‌లోని సతాతా ప్రాంతంలో శారదీయ దుర్గా పూజకు ఎన్నో ఏళ్ల చరిత్ర ఉంది. అయితే, ఇంతకుముందు అమ్మవారి పూజ మండప అభివృద్ధి పనులు చేసిన సభ్యుడికి నగదు చెల్లించలేదు కమిటీ. దీంతో అతడు అమ్మవారి నగలు తీసుకుని.. తనఖా పెట్టుకున్నాడు. తన నగదు చెల్లిస్తే.. ఆభరణాలను తిరిగి ఇస్తానని కమిటీకి స్పష్టం చేశాడు. ఈ క్రమంలోనే అమ్మవారి ఆభరణాలు లేకుండా పూజలు ఎలా చేయాలన్న సందిగ్ధంలో పడింది ఆలయ కమిటీ. ఈ సమస్యను విన్న స్థానిక ముస్లిం నేత షేక్ లియాకత్ ఉద్దీన్ అహ్మద్ ముందుకు వచ్చారు. నిర్మాణదారుడికి ఇవ్వాల్సిన రూ. 48 వేలు చెల్లించి ఆభరణాలను విడిపించాడు. సమస్య పరిష్కారం కావడం వల్ల దుర్గాదేవి పూజకు సిద్ధం చేస్తున్నారు ఆలయ కమిటీ సభ్యులు.
"ఆలయ మాజీ కమిటీ సభ్యుడు.. పూజ మండపం అభివృద్ధి పనులు చేపట్టారు. ఇందుకోసం అతడు రూ. 48వేల వరకు సొంతంగా వెచ్చించాడు. అయితే, దీనికి సంబంధించిన నగదును తిరిగి అతడికి చెల్లించకపోవడం.. ఆభరణాలు తనఖా పెట్టుకున్నాడు. కమిటీ సభ్యులు.. నన్ను సంప్రదించగా ఆ బాధ్యతను నేను తీసుకున్నాను. అతడికి రావాల్సిన మొత్తాన్ని చెల్లించి నగలను విడిపించాను. మేము 14 తరాలుగా ఇక్కడే నివసిస్తున్నాము. ఇక్కడ తామంతా సోదరుల్లా కలిసి మెలిసి జీవిస్తాం."