హిందువులు జరుపుకొనే ఆంజనేయస్వామి ఉత్సవాల్లో పాల్గొని మతసామరస్యాన్ని చాటారు కొందరు ముస్లింలు. ఉత్సవంలో భాగంగా పూజలు నిర్వహించి హిందువులతో కలిసి రథాన్ని లాగారు. ఈ ఘటన కర్ణాటకలోని తుమకూరు జిల్లా చిక్కనాయకనహల్లి ప్రాంతంలో జరిగింది. ఇటీవల కాలంలో ఆ రాష్ట్రంలో ఇరు వర్గాల మధ్య పలు అంశాలపై వివాదం తలెత్తిన నేపథ్యంలో ఈ ఘటన ప్రాధాన్యం సంతరించుకుంది.
అయితే, ఇలా అక్కడి ఆంజనేయ రథోత్సవంలో ముస్లింలు పాల్గొనడం అనేది తొలిసారి కాదు. ఎన్నో ఏళ్లుగా ఇరు వర్గాలు కలిసి ఉత్సవాల్లో పాల్గొనడం సంప్రదాయంగా వస్తోంది. హిందువులతో కలిసి ఇస్లాం మతస్థులు పూజలు నిర్వహించడమే కాక రథోత్సవంలో పాల్గొని ఉత్సవాలు వైభవంగా జరిపించడంలో తమ వంతు పాత్ర పోషిస్తున్నారు. ఏటా జరుపుకున్నట్టే ఈసారి కూడా హిందూ-ముస్లింలు కలిసి ఈ ఉత్సవాలు జరుపుకొన్నారు.