ప్రస్తుతం దేశంలో న్యాయమూర్తులను నియమిస్తున్న కొలీజియం వ్యవస్థ రాజ్యాంగానికి అతీతమన్నట్లు వ్యాఖ్యానించి తేనెతుట్టెను కదిపారు కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు. 2014లో తెచ్చిన జాతీయ న్యాయ నియామకాల కమిషన్ (ఎన్‌జేఏసీ)ని కొట్టేయటం ద్వారా ప్రజలెన్నుకున్న పార్లమెంటు సార్వభౌమతాన్ని సుప్రీంకోర్టు తోసిపుచ్చిందని ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్ విమర్శించారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తులు కూడా అంతేఘాటుగా స్పందించి.. ప్రభుత్వం మాటలు అదుపులో పెట్టుకుంటే మంచిదని హెచ్చరించారు. తాజాగా రెండ్రోజుల కిందట.. న్యాయస్థానాల్లో కొండల్లా పేరుకుపోయిన కేసులకు కొలీజియం వ్యవస్థే కారణమన్నట్లుగా కిరణ్ రిజిజు మళ్లీ ప్రకటించటం గమనార్హం!. మొత్తానికి న్యాయమూర్తుల నియామక వ్యవహారంపై నరేంద్రమోదీ ప్రభుత్వానికి, న్యాయవ్యవస్థకు మధ్య నెలకొన్న ఘర్షణ వాతావరణానికి ఇవన్నీ అద్దంపడుతున్నాయి.
రాజ్యాంగం ఏం చెప్పింది?
స్వతంత్ర న్యాయవ్యవస్థ అనేది ప్రజాస్వామ్యంలో అత్యంత కీలకం. రాజ్యాంగంలోని ఆర్టికల్ 124, 217లు సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తుల నియామక అధికారాలను రాష్ట్రపతికి దఖలు పరిచాయి. సుప్రీంకోర్టు ప్రధాన నాయమూర్తి, ఇతర న్యాయమూర్తులను సంప్రదించి రాష్ట్రపతి న్యాయమూర్తుల నియామకాలు చేస్తారని రాజ్యాంగం పేర్కొంది. ఈ 'సంప్రదింపుల' పదాన్ని నిర్వచించటంలోనే చిక్కుముడులు పడ్డాయి.
తొలుత ఎలా?
స్వాతంత్య్రం వచ్చిన తర్వాతి నుంచి న్యాయమూర్తుల నియామకాలు ప్రభుత్వ ఇష్టాయిష్టాల మేరకే జరిగినా సంప్రదాయాలను పాటించారు. ముఖ్యంగా 1950-73 దాకా సీనియర్ న్యాయమూర్తిని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమించారు. 1973లో ప్రధాని ఇందిరాగాంధీ ప్రభుత్వం ఈ సంప్రదాయానికి గండికొట్టి ముగ్గురు సీనియర్ న్యాయమూర్తులను కాదని జస్టిస్ ఎ.ఎన్.రేకు ప్రధాన న్యాయమూర్తి పదవిని కట్టబెట్టింది. 1977లో మళ్లీ ఇందిర హయాంలోనే సీనియర్లను పక్కనబెట్టి జస్టిస్ మిర్జా హమీదుల్లా బేగ్‌ను నియమించారు. సుప్రీంకోర్టులో అత్యంత సీనియర్ న్యాయమూర్తినే ప్రధాన న్యాయమూర్తిగా నియమించాలంటూ 1993లో సుప్రీంకోర్టు ఇచ్చిన ఓ తీర్పుతో ప్రభుత్వ విశేషాధికారాలకు కత్తెరపడింది. కొలీజియం వ్యవస్థకు నాందిపడింది.
మరి సమస్యేంటి?
ఈ కొలీజియం వ్యవస్థ అనేది రాజ్యాంగంలో ఎక్కడా లేదు. సుప్రీంకోర్టు తీర్పుల ఆధారంగా ఏర్పడింది. ప్రభుత్వానిది ఇందులో పరిమితమైన పాత్ర! ఏ పేరుపైనైనా ప్రభుత్వం అభ్యంతరం తెలుపవచ్చు. కానీ కొలీజియం మళ్లీ అదే పేరును సిఫార్సు చేస్తే నియమించటం తప్ప ప్రభుత్వం చేసేదేమీ లేదు. న్యాయమూర్తులను న్యాయమూర్తులే నియమించుకోవటమేంటనేది విమర్శ! అంతేగాకుండా కొలీజియం వ్యవస్థలో పారదర్శకత లేదని... ఎలాంటి రికార్డు ఉండదనీ.. అంతా రహస్యంగా జరిగే నిర్ణయాలనేది ప్రధాన విమర్శ.
అందుకే.. వచ్చింది ఎన్‌జేఏసీ
కేంద్ర ప్రభుత్వం 2014 ఆగస్టులో 99వ రాజ్యాంగ సవరణ ద్వారా జాతీయ న్యాయ నియామకాల కమిషన్ (ఎన్‌జేఏసీ)ని ఏర్పాటు చేసింది. ఈ బిల్లుకు ఆనాడు అన్ని పార్టీలూ మద్దతివ్వటం గమనార్హం. నియామకాలతో పాటు న్యాయమూర్తుల బదిలీలను కూడా ఈ కమిషన్ చూసుకుంటుంది. ఎన్‌జేఏసీలో సుప్రీంకోర్టు న్యాయమూర్తితో పాటు సుప్రీంకోర్టు నుంచే సీనియర్ న్యాయమూర్తులు సభ్యులుగా ఉంటారు. వీరికి తోడు కేంద్ర న్యాయశాఖ మంత్రి, ఇద్దరు నిపుణులను ఎక్స్ అఫీషియో సభ్యులుగా ఉంటారు. ఈ ఇద్దరు నిపుణులను సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి, ప్రధాన మంత్రి, లోక్‌సభలో విపక్ష నేతలతో కూడిన కమిటీ ఎంపిక చేస్తుంది. అయితే.. 2015 అక్టోబరులో ఐదుగురు సభ్యుల సుప్రీంకోర్టు ధర్మాసనం 4:1 మెజార్టీతో ఎన్‌జేఏసీని కొట్టేసింది.