College Student Murdered: తమిళనాడు చెన్నైలో దారుణ ఘటన వెలుగుచూసింది. పదో తరగతి చదువుతున్న ఇద్దరు బాలికలు.. ఓ యువకుడిని హత్య చేయించారు. తమ స్నేహితుల సాయంతో పథకం ప్రకారం చంపేశారు. డిసెంబరు 19న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
ఇన్స్టాగ్రామ్ స్నేహితుల సాయంతో..
"ప్రేమ్ కుమార్(21) అనే కాలేజీ విద్యార్థి.. పదో తరగతి చదువుతున్న ఇద్దరు బాలికల అసభ్యకర ఫొటోలు తీసి, వాటిని నెట్టింట్లో పెడతానని తరచూ బెదిరించేవాడు. అలా చేయకుండా ఉండేందుకు ప్రేమ్ కుమార్‌కు చెరో రూ.50 వేలు చెల్లించారు. అయినప్పటికీ ఆ యువకుడు బెదిరించడం ఆపలేదు. దీంతో ఒత్తిడిని తట్టుకోలేని బాలికలు.. ప్రేమ్ కుమార్ ఫోన్ తీసుకుని తమ ఫొటోలను డిలీట్ చేయాలని నిర్ణయించుకున్నారు. ఇందుకు ఇన్స్టాగ్రామ్ స్నేహితుడైన అశోక్‌ను సాయం కోరారు. రెడ్‌హిల్స్‌కు చెందిన అశోక్, అతని ముగ్గురు స్నేహితులు.. శుక్రవారం(డిసెంబరు 17) ఉదయం షోలవరం టోల్‌ప్లాజాకు ప్రేమ కుమార్‌ను రప్పించి అపహరించారు. ఆ తర్వాత తిరువళ్లూరులోని ఈచనాడు గ్రామానికి తీసుకెళ్లారు. అక్కడే డిసెంబరు 19న హత్య చేసి పూడ్చిపెట్టారు" అని పోలీసులు వెల్లడించారు.
గ్రామస్థుల సమాచారంతో ఘటనా స్థలానికి వెళ్లిన అధికారులు.. మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి తరలించారు. అనంతరం మృతదేహాన్ని మృతుడి కుటుంబానికి అప్పగించినట్లు పేర్కొన్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు.
ఇదీ చూడండి:కుక్క పేరు తెచ్చిన తంట.. మహిళ ఒంటికి నిప్పంటించి..