ప్రజా ప్రతినిధులపై పెట్టిన కేసుల దర్యాప్తులో మితిమీరిన ఆలస్యం జరుగుతుండడంపై బుధవారం సుప్రీంకోర్టు(Supreme Court) అసంతృప్తి వ్యక్తంచేసింది. ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ), సీబీఐలు కేసులు నమోదు చేస్తున్నా, వాటికి ఎప్పటికీ ముగింపు ఉండడం లేదని ఆక్షేపించింది. ఇందుకోసం అవసరమైన మానవ వనరులు, ఇతర సదుపాయాలను కల్పించాలని కేంద్ర ప్రభుత్వానికి సూచించింది.
ప్రజాప్రతినిధులపై పెట్టిన కేసులను త్వరగా విచారించాలని, నేరం రుజువైతే వారు జీవితకాలం పాటు ఎన్నికల్లో పోటీ చేయకుండా నిషేధించాలంటూ భాజపా నాయకుడు అశ్విన్ ఉపాధ్యాయ దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై విచారణ సందర్భంగా పై వ్యాఖ్య చేసింది. దీనిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి.రమణ(CJI NV Ramana), జస్టిస్ డి.వై.చంద్రచూడ్, జస్టిస్ సూర్యకాంత్‌లతో కూడిన ధర్మాసనం విచారణ జరుపుతోంది. "దర్యాప్తులో ఏమైనా ఉంది అని తేలితే వెంటనే అభియోగ పత్రాలు (ఛార్జిషీట్) దాఖలు చేయండి.. నిందితుల తలపై కత్తిని వేలాడదీయొద్దు.. ఏవైనా తప్పులుంటే వెంటనే విచారణ వేగవంతం చేయండి" అని జస్టిస్ రమణ వ్యాఖ్యానించారు.
"దర్యాప్తు సంస్థలపై మేం ఏమీ చెప్పడం లేదు. ఎందుకంటే వాటి నైతిక స్థైర్యాన్ని తగ్గించే ఉద్దేశం లేదు. కోర్టుల్లో 200కుపైగా కేసులు అసంపూర్తిగా ఉన్నాయి. 10, 15 ఏళ్లు దాటినా అభియోగ పత్రాలు నమోదు చేయకపోవడంపై ఎలాంటి కారణాలూ చెప్పడం లేదు. సంబంధిత వ్యక్తుల ఆస్తులు స్వాధీనం చేసుకున్నంత మాత్రాన సరిపోదు" అని ధర్మాసనం వ్యాఖ్యానించింది.
న్యాయస్థాన సహాయకునిగా (అమికస్ క్యూరీ)గా వ్యవహరిస్తున్న సీనియర్ న్యాయవాది విజయ్ హన్సారియా మాట్లాడుతూ ప్రజాప్రతినిధులపై సీబీఐ, ఈడీలు నమోదు చేసిన కేసులు ఆందోళన కలిగిస్తున్నాయని, త్వరగా విచారణ జరిగేలా సర్జికల్ చర్యలు తీసుకోవాలని అభిప్రాయపడ్డారు. దీనిపై జస్టిస్ రమణ స్పందిస్తూ "ఈడీ, సీబీఐ సమర్పించిన నివేదికలను చదివాం. ఇవి అసమగ్రంగా ఉన్నాయి. విచారణ త్వరగా ముగించాలని చెప్పడం సులువే. కానీ ఇందులో చాలా సమస్యలు ఉన్నాయి. కోర్టులు, న్యాయమూర్తులు, మౌలిక సౌకర్యాల కొరత ఉంది. దర్యాప్తు సంస్థల్లోనూ మానవ వనరులు తగినంతగా లేవు. ఇటీవల కాలంలో ప్రతి వారూ సీబీఐ దర్యాప్తును కోరుతున్నారు. నివేదికల సారాంశాన్ని రాసుకున్నాను. 2012 నుంచి ఈడీకి చెందిన 76 కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. సీబీఐ దర్యాప్తు చేస్తున్న 58 కేసుల్లో జీవితకాల శిక్ష పడే అవకాశం ఉంది. 2000వ సంవత్సరానికి చెందిన ఒక కేసు కూడా పెండింగ్‌లో ఉంది" అని వివరించారు.
దీనిపై సొలిసిటర్ జనరల్ సమాధానం ఇస్తూ నిర్ణీత వ్యవధిలో ముగించాలంటూ దర్యాప్తు సంస్థలు, ట్రయల్ కోర్టులకు ధర్మాసనమే ఆదేశాలు ఇవ్వవచ్చని తెలిపారు. చాలా మంది విదేశాలకు సొమ్ము తరలించినందున నగదు అక్రమ చలామణి కేసుల దర్యాపు ఆలస్యమవుతోందన్నారు. ఉన్నత న్యాయస్థానాలు స్టేలు ఇవ్వడం కూడా మరొక కారణమని చెప్పగా, ఇది సరికాదని ఇలాంటి కేసులు పది కూడా లేవని జస్టిస్ రమణ అన్నారు.
జీవితకాల నిషేధంపై పార్లమెంటే నిర్ణయం తీసుకోవాలి
వివిధ కేసుల్లో శిక్షలు పడిన ప్రజా ప్రతినిధులు ఎన్నికల్లో పోటీ చేయకుండా జీవితకాల నిషేధం విధించడంపై పార్లమెంటే నిర్ణయం తీసుకోవాలని జస్టిస్ రమణ(CJI NV Ramana) అన్నారు.
కేసులు ఎత్తివేసే అధికారం రాష్ట్రాలకు ఉంది, కానీ..
తొలుత అమికస్ క్యూరీ విజయ్ హన్సారియా మాట్లాడుతూ ప్రజాప్రతినిధులపై పెట్టిన కేసులను రాష్ట్ర ప్రభుత్వాలు ఎత్తివేస్తున్నాయని తెలిపారు. మునుపటి ప్రభుత్వాలు దురుద్దేశాలతో ఈ కేసులను పెట్టినందున వాటిని ఉపసంహరిస్తున్నట్టు ఒకే ఒక కారణాన్ని చూపుతున్నాయని తెలిపారు. దీనిపై ధర్మాసనం స్పందిస్తూ "రాష్ట్ర ప్రభుత్వాలు కేసులు ఎత్తివేయడాన్ని మేం వ్యతిరేకించడం లేదు. దురుద్దేశంతో పెట్టిన కేసులను ఎత్తివేసే అధికారం వాటికి ఉంది. అయితే ముందుగా న్యాయ అధికారిగానీ, హైకోర్టుగానీ వాటిని పరిశీలించాల్సి ఉంటుంది. కేసుల ఎత్తివేతపై తొలుత ప్రభుత్వాలు హైకోర్టును ఆశ్రయించాల్సి ఉంటుంది" అని పేర్కొంది. వీటిపై ఉత్తర్వులు ఇస్తామని తెలిపింది.
కమిటీ ఏర్పాటుపై అభిప్రాయం ఏమిటి?
పెండింగ్ కేసుల పర్యవేక్షణకు కమిటీ ఉండాలని అమికస్ క్యూరీ ధర్మాసనానికి సూచించారు. సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి లేదంటే హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి ఆధ్వర్యంలో ఈడీ, సీబీఐల డైరెక్టర్లు లేదంటే వారి ప్రతినిధులు, కేంద్ర హోం కార్యదర్శి లేదంటే ఆయన ప్రతినిధి, కోర్టు నియమించే జిల్లా జడ్జి స్థాయి అధికారి సభ్యులుగా ఈ కమిటీ ఉంటే బాగుంటుందని చెప్పారు. దీనిపై సమాధానం ఇవ్వాలని సొలిసిటర్ జనరల్‌ను ధర్మాసనం సూచించింది.
తీవ్ర నేరారోపణ కేసుల్లోనూ అసాధారణ జాప్యం