అసోంలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా పర్యటనకు ఒక రోజు ముందు.. ఆ రాష్ట్ర పోలీసులు, పౌరుల మధ్య శనివారం తీవ్ర ఘర్షణ చెలరేగింది. టిన్సుకియా జిల్లాలోని భాగ్జన్ ప్రాంతంలో జరిగిన ఈ ఘటనలో పలువురు పోలీసులు గాయపడ్డారు. ఆందోళనకారులకు కూడా గాయాలయ్యాయి.
పరిహారం చెల్లిస్తేనే..
భాగ్జన్లోని ఆయిల్ ఇండియాకు చెందిన ఓ చమురు బావిని సీల్ చేయడానికి వాడిన పరికరాలను తొలగించేందుకు వచ్చిన సిబ్బందిని స్థానికులు అడ్డుకున్నారు. గతేడాది ఆ బావిలో జరిగిన భారీ అగ్ని ప్రమాదంతో ఈ ప్రాంతం తీవ్ర వినాశనానికి గురైంది. దీంతో ప్రభావిత కుటుంబాలకు తొలుత పరిహారం చెల్లించాలని స్థానికులు డిమాండ్ చేశారు. రోడ్డును దిగ్బంధించారు.
పరిస్థితిని చక్కబెట్టేందుకు భద్రతా దళాలు ప్రయత్నించే క్రమంలో ఆందోళనకారులు వారిపై రాళ్లు విసిరారు. దీంతో పరిస్థితి అదుపు తప్పి హింసాత్మకంగా మారింది. క్రమంగా నిరసనకారుల సంఖ్య పెరగడం వల్ల బలగాలు లాఠీఛార్జ్ చేశారు. గాల్లోకి కాల్పులు జరిపి, బాష్పవాయువు గోళాలను ప్రయోగించారు. ఈ ఘటనలో ఆరుగురు పోలీసులు, మరో ఇద్దరు పౌరులకు గాయాలయ్యాయని అధికారులు తెలిపారు. ఆ ప్రాంతంలో 144 సెక్షన్ విధించారు.
ప్రజలకు సర్దిచెప్పే ప్రయత్నం చేస్తున్న అధికారులు ఇదీ చూడండి:అసోం చమురు బావిలో మరో భారీ పేలుడు