Children Vaccine Registration: పిల్లలు సురక్షితంగా ఉంటేనే దేశ భవిత భద్రంగా ఉంటుందన్నారు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మాన్సుఖ్ మాండవియా. వ్యాక్సినేషన్ కోసం అర్హులైన పిల్లల పేర్లను కుటుంబ సభ్యులు కొవిన్‌లో రిజిస్టర్ చేయించాలని కోరారు. దేశంలో 15-18 ఏళ్ల వయసు పిల్లలకు టీకా అందించేందుకు కొవిన్ పోర్టల్‌లో రిజిస్ట్రేషన్ శనివారం(జనవరి 1) ప్రారంభమైన నేపథ్యంలో ఈ మేరకు ట్వీట్ చేశారు.
" పిల్లలు సురక్షితంగా ఉంటేనే.. దేశ భవిష్యత్తు సురక్షితం. నూతన ఏడాది సందర్భంగా.. 15-18 ఏళ్ల వయసు పిల్లలకు కొవిడ్-19 వ్యాక్సినేషన్ కోసం కొవిన్ పోర్టల్‌లో రిజిస్టేషన్ ఇవాళ ప్రారంభమైంది. అర్హులైన చిన్నారుల పేర్లను నమోదు చేయాలని కుటుంబ సభ్యులను కోరుతున్నా."
- మాన్సుఖ్ మాడవియా.
దేశంలో ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో 15-18 ఏళ్ల వయసు పిల్లలకు జనవరి 3వ తేదీ నుంచి టీకా ఇవ్వనున్నట్లు 2021, డిసెంబర్ 25న ప్రకటించారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. అలాగే, 60 ఏళ్లు పైబడిన వారికి జనవరి 10 నుంచి ప్రికాషనరీ డోస్ ఇస్తామని తెలిపారు. ఈ క్రమంలో పిల్లలకు కొవాక్జిన్ అందించాలని, అదనపు డోసులు పంపిస్తామని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు సమాచారం ఇచ్చారు కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి. ఎంత మేర సరఫరా చేస్తారనే విషయాన్ని త్వరలోనే తెలపనున్నారు.