బిహార్‌లో దారుణం జరిగింది. సరిగ్గా చదవట్లేదని ట్యూషన్‌కు వచ్చిన 5 ఏళ్ల బాలుడిపై టీచర్ విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డాడు. కర్రతో కొడుతూ, కాలితో తన్నాడు. బాలుడు కొట్టొద్దని ఎంత ప్రాధేయపడినా వినలేదు. ఆఖరికి విద్యార్థి స్పృహ తప్పి కింద పడిపోయాడు. తీవ్ర గాయాలైన బాలుడిని ఆసుపత్రికి తరలించాడు. ఈ ఘటన పట్నా, వీర్ ఒరియా ప్రాంతంలోని జయ కోచింగ్ సెంటర్లో జరిగింది. నిందితుడు ఛోటూపై పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. చిన్నారిపై దాడికి పాల్పడిన అతడిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.
బాలుడు అపస్మారక స్థితిలోకి వెళ్లాడన్న విషయం తెలుసుకున్న గ్రామస్థులు.. ఉపాధ్యాయుడు ఛోటూపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నిందితుడిని చిదకబాదారు. ఈ దాడిలో అతడికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే ఆసుపత్రికి తరలించారు. ఈ విషయం తెలుసుకున్న జయ కోచింగ్ ఇన్స్టిట్యూట్లో చదువుతున్న విద్యార్థుల తల్లిదండ్రులు భయాందోళనలకు లోనయ్యారు.